నటన ఒంట్లోకి వచ్చాక అది ఇంట్లోకి వస్తుంది. ఆ బ్లడ్ అలాంటిది. చూసే వారు లేకపోయినా రంగు పూసుకోకపోయినా కూడా ఆ వ్యసనం ఒక్కలా ఉండనీయదు. అందుకే తామన్నది మరచిపోతారేమో. అందులోనే పడి కిందా మీదా కొట్టుకుంటారేమో. ఇదే బలహీనత, ఇంకా చెప్పాలంటే ఇదే బలం కూడా.

 

ఇపుడు ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టిపడేస్తోంది. దానికి వారూ వీరూ అన్న తేడా లేరు. ఎవరైనా ఒక్కటే అంటోంది. వివాదాస్పద  డైరెక్టర్  రాం గోపాల వర్మ మాటల్లో చెప్పాలంటే దేవుడికైనా పక్షపాతం ఉందేమో కానీ కరోనాకు లేనే లేదుట. అందుకే అందరి కంటే ముందే పెద్దవాళ్ళంతా సర్దుకున్నారు. ఇంట్లో ఉంటే కరోనా రాదన్నారు కాబట్టి ఇంట్లో ఉంటే  పోలా అనుకున్నారు.

 

కానీ తిరిగే కాలూ. డైలాగు తిప్పే నోరూ ఊరకే ఉంటాయా.  ఒక్క రోజుకే మన సెలిబ్రిటీలు  ఉక్క బోతతో నానా అవస్థలు పడుతున్నారు. దాంతో ఇపుడు సోషల్ మీడియా మీద పడిపోతున్నారు. అక్కడ తమ‌ నటనా విన్యాసాన్ని చూపిస్తూ తరించేస్తున్నారు. ఎన్నడూ చేయని పనులను చేసి చూపించేస్తూ తమలో తామే పొంగిపోతున్నారు.

 

ఒక హీరోయిన్ గారేమో ఇంట్లో అంట్లు తోముతూ అక్కడ కూడా సొగసు సెగలు గుప్పిస్తోంది. మరోకాయన ఇంట్లో పెద్దోళ్ళను ముద్దులతో ముంచెత్తుతూ తాను బంధాల పట్ల ఎంతటి బద్ధున్నో  చెప్పకనే చెబుతూ జీవించేస్తున్నాడు. ఇంకో మహానటుడైతే ఏకంగా తోటమాలి అవతారంలోకి మారిపొయాడు. మొక్కలను నీళ్ళు పోస్తూ లెక్కలేనంతా హీరోయిజం చూపించేస్తున్నాడు.

 

వంటలు చేస్తున్న హీరోలు ఒక చోట  ఉంటే. ఇల్లు తుడుస్తున్న వారూ ఉన్నారు. ఇంకో బాలీవుడ్ హీరోగారు తన మేనల్లుడితో మామిడికాయలు కోయిస్తూ అక్కడ కూడా హీరోయిజం తెలియకుండానే ఒలకబోస్తున్నారు. ఇలా వీరంతా ఇంతటి ఇంటి సేవ చేస్తూ ఫ్యాన్స్ కి ఖుషీ చేస్తున్నారు పెద్ద తెరలను చించుకుని మరీ మన  బుల్లి మొబైల్లోకి వచ్చేస్తున్నాం.  తమదైన  నటనతో అసలు ఏ ఒక్కరినీ  వదిలేది లేదని చెబుతున్నారు.

 

ఇదంతా బాగానే ఉంది కానీ మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది.  కరోనా వచ్చినపుడే అది చేయాలా. పైగా దానికి ఫోటోలూ ఫోజులతో లైక్స్ అనే కీర్తి కక్కుర్తి కావాలా. ఎవరిదైనా పొట్ట కూటి కొరకు చేసే  వ్రుత్తే. రిక్షా తొక్కేవాడికి  వేయి రూపాయలు వస్తే రంగులేసుకునే వాడికి కోట్ల రూపాయలు వస్తాయి. అంతమాత్రం చేత‌ ఇంట్లో పనులు చిన్నవి అవుతాయా. కరోనా వచ్చినపుడే అవి ఒక్కసారిగా  గుర్తుకువస్తాయా. 

 

ప్రాణాల మీదకు వస్తున్న కరోనా ముందు అంతా ఒకటే. ఇకనైనా నటన మాని మనమంతా మనుషులమని చాటి చెబితే బాగుంటుంది. సొంత  ఫోజులతో ఫోటోలు పెట్టేబదులు కరోనాకు ఆర్ధిక సాయంతో పాటు, వీలుంటే ప్రత్యక్ష సేవకు కూడా దిగితే అసలైన హీరోలు అనిపించుకుంటారేమో. కాస్తా ఆలొచించండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: