పుట్టి బుద్దెరిగి వెండి తెర ఇలా వెలవెలపోవడం ఎవరూ ఎరగరు. వినోదానికి ఏ కాలంలోనైనా సినిమాయే  ప్రధాన ఆకర్షణ.  ఇప్పటికీ ఇన్ని రకాలైన ఆప్షన్లు వచ్చినా కూడా సినిమా హాల్ కి వెళ్తే వచ్చే ఫీల్ వేరు. పెద్ద తెర మీద మూవీ చూస్తే ఆ హుషారే వేరుగా ఉంటుంది.

 

అటువంటి వెండి తెర ఈనాడు బోసిపోయింది. బంగారం పండించే తెర వెనక్కుపోయింది. అభిమానులకు దేవాలయాలు లాంటి సినిమా హాళ్ళు ఇన్నేసి రోజులు మూతబడడం అంటే  బాధాకరమే. మరో రెండు రోజుల్లో ఏప్రిల్ నెల వస్తోంది. 

 

అంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అన్నమాట. ఈ సమ్మర్  సీజన్ నిజంగా టాలీవుడ్ కి కాసులు కురిపించేదే. దాదాపుగా పెద్దా చిన్నా సినిమాలు అన్నీ కలుపులుని ముప్పయి వరకూ రిలీజ్ అవుతాయి. ఏ మాత్రం బాగున్నా  మూవీ పెట్టుబడి వెనక్కు వచ్చేస్తుంది. అందుకే బిగ్ సీజన్ లాంటి సమ్మర్ మీద అందరూ కన్నేసి కర్చీఫ్ పరచేస్తారు.

 

అటువంటి ఈ సమ్మర్ కరోనా కాటుకు వెనక్కిపోయినట్లే. ఇక కరోనా నియంత్రణ జరిగి లాక్ డౌన్ ఎత్తివేస్తే మళ్ళీ మామూలు పరిస్థితి వస్తుందా అన్న డౌట్లు కూడా ఉన్నాయి. జనం చేతిలో చిల్లి గవ్వ లేని ఘోరమైన సీన్ అపుడు వస్తుంది. ఆ టైంలో సినిమాలకు డబ్బులు పెట్టి ధియేటర్లకు వచ్చే వారు ఉంటారా అన్నది పెద్ద డౌట్. 

 

అంతే కాదు, ఇప్పటికే సోషల్ మీడియా, మొబైల్స్, ఇంటి తెరకు ఆడియన్స్  అలవాటు కనుక పడితే మళ్ళీ వారిని పెద్ద తెర వైపునకు మళ్ళించడం కూడా కష్టమే అవుతుంది. అది సినిమా రంగం మీద  పెను  ప్రభావం చూపుతుంది. భారీ పెట్టుబడులతో సినిమాలు వస్తాయా, వచ్చినా నాలుగు డబ్బులు సంపాదించుకుంటాయా. ఇవన్నీ వరసగా వచ్చే సందేహాలే. మొత్తానికి వెండితెర ఫ్యూచర్  కి కరోనా పెద్ద కాటే వేసిందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: