ఇటీవల బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాలతో మన దేశంతో పాటు పలు ఇతర దేశాల్లో కూడా టాలీవుడ్ కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెంచిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో కలిసి ఆయన తీస్తున్న తాజా సినిమా రౌద్రం రణం రుధిరం. ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు స్వరవాణి ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, వి విజయేంద్ర ప్రసాద్ కథను సమకూరుస్తున్నారు. ఇక ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోలు విపరీతమైన స్పందనను దక్కించుకోవడం జరిగింది. 

 

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి దర్శకుడు రాజమౌళి, కాసేపటి క్రితం బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి అయిందని, అలానే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తాలూకు సీన్స్ అన్నీ చిత్రీకరించడం జరిగిందని, అయితే అలియా భట్ రాబోయే మరికొద్దిరోజుల్లో షూట్ లో జాయిన్ అవుతారని అన్నారు. ఇక ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ఒకరిని మించి మరొకరు ఎంతో అద్భుతంగా పెర్ఫర్మ్ చేసారని, తప్పకుండా మెగా, నందమూరి ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు రాజమౌళి. 

 

అయితే ఇటీవల తీసిన బాహుబలి, ప్రస్తుతం తీస్తున్న ఆర్ఆర్ఆర్ కంటే కూడా కొన్నేళ్ల క్రితం తాను తీసిన ఈగ సినిమా విషయమై పడ్డ కష్టం ఎంతో ఎక్కువ అని, ఆ సినిమా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ విషయమై పడ్డ శ్రమ అంతా ఇంతా కాదని, ఆ విషయంలో ఈ రెండు సినిమాలు కూడా దాని ముందు దిగదుడుపే అని రాజమౌళి అన్నారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో లాకౌట్ ప్రకటించడంతో తమ టీమ్ మొత్తం ఇంటి నుండి వర్క్ చేస్తోందని, అవకాశం ఉన్నంతవరకు సినిమాని అనుకున్న సమయానికే పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: