దానం చేయాలంటే మనసు మాత్రమే ఉండాలి. మనీ కాదు. ఈ సంగతి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అక్షరాలా నిరూపించుకున్నాడు. ఈ ప్రపంచంలో మనుషుల కంటే కూడా ఎక్కువ తీపి మనీ మీదనే ఉంటుంది. కానీ దానికి ఏ కొద్ది మందో దూరంగా ఉంటారు. ఇపుడు నిలువెత్తు నిదర్శంగా అక్షయ్ కుమార్ నిలిచాడు.

 

ఏకంగా ఆయన పాతిక కోట్ల రూపాయలను పీఎం కేర్స్ ఫండ్ కి ఇచ్చేశారు. ఎడమ చేతికి కూడా తెలియకుండా దానం చేయమంటారు. అందుకే తన ఇంట్లో వారి ఏమైపోతారన్న కనీస  ఆలోచన సైతం పక్కన పెట్టి అక్షయ్ చేసిన ఈ దానం ఇపుడు సర్వ ప్రశంశాపాత్రమైంది. ప్రధాని మోడీ స్వయంగా అక్షయ్ ని మెచ్చుకున్నారు. ఆయన కంటే డబ్బులో ఎంతో ఎత్తున ఉన్న హీరో కంటే ఇపుడు అక్షయ్ చాలా ఎత్తున నిలిచిపోయాడు.

 

తనను ఇంతటి వాడిని చేసిన ప్రజల కోసం అక్షయ్ కుమార్ చేసిన ఈ దానం గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి అలాంటి అక్షయ కుమార్ మన టలీవుడ్ కి ఒక్కరైనా ఉన్నారా. ఎందుకంటే ఇపుడు బాలీవుడ్ ని మించి టాలీవుడ్ దూసుకువస్తోంది.  హిట్లు కనుక వస్తే వందల కోట్లు వసూల్ చేస్తున్న సినిమాలు మనకూ చాలానే ఉన్నాయి.

 

ఇక మన హీరోలు కూడా సినిమాకు యాభై నుంచి డెబ్బై కోట్లు తీసుకునే రేంజి ఎదిగారు. ఒక్క సినిమా మొత్తంలో కొంత తీసి ఇచ్చిన టాలీవుడ్లో కూడా అక్షయ్ కుమార్లు ఎందరో ఉంటారు. కానీ బడా హీరోలని చెప్పుకుంటున్న వారు ఇపుడు ఎందుకో బాగా వెనక్కితగ్గిపోతున్నారు.

 

రెమ్యునరేషన్ దగ్గరకు వచ్చేసరికి తాము కింగులమని పత్రికలలో రాయించుకునే ఈ రీల్ హీరోలు రియల్ లైఫ్ లో మాత్రం అతి పిసినారితనమే చూపిస్తున్నారు. సరే టాలీవుడ్ అక్షయ్ కుమార్ గా ప్రస్తుతం చెప్పుకోవాలంటే ఒక్క  ప్రభాస్ నే పేర్కొనాలి.

 

నాలుగు కోట్ల రూపాయలు ప్రభాస్ విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు. కనీసం ప్రభాస్ తో పోటీ పడడానికి కూడా మిగిలిన హీరోలకు ధైర్యం చాలడంలేదులా ఉంది. ఏది ఏమైనా ఎంతో కొంత విదిల్చారు. అది చాలు. అదే మనకు ఇపుడు మహా భాగ్యం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: