ప్రస్తుతం కరోనా వ్యాధి రోజు రోజుకు మరింతగా వ్యాపిస్తుండడంతో పలు దేశాలు ఎంతో హడలి పోతున్నాయి. ఇప్పటికే మన దేశం సహా పలు ఇతర దేశాల వారు తమ ప్రజలను ఇళ్ల నుండి బయటకు రానీయకుండా లాకౌట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక మన దేశాన్ని మొత్తం 21 రోజుల పాటు లాకౌట్ చేస్తున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే కొందరు ప్రజలు మాత్రం అవసరం ఉన్నా లేకున్నా అనవసరంగా బయటకు వస్తున్నారని, అయితే ఆ విధంగా చేయడం వలన ఒకరి నుండి మరొకరికి ఈ మహమ్మారి కరోనా తేలిగ్గా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని, ఒకవేళ అదే జరిగితే దానివల్ల జరిగే పరిణామాలు ఊహించనలవి కానివని మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేతులు జోడించి ఇళ్ల వద్దనే ఉండాలి అంటూ విజ్ఞప్తులు చేస్తున్నాయి. 

 

వాస్తవానికి అక్కడక్కడా కొందరు మాత్రం సరుకులు, కూరగాయలు, పాలు, అత్యవసర వైద్యం వంటి వాటి కోసం బయటకు వస్తుండడంతో దానిని అదనుగా తీసుకొని మరికొందరు యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్లు బయట తిరుగుతున్నారని అధికారులు, పోలీసులు వాపోతున్నారు. మొహానికి ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకోవడం, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడంతో పాటు సోషల్ డిస్టెన్స్ కూడా తప్పనిసరిగా పాటించాలని వారు కోరుతున్నారు. అయితే దీనిపై నేడు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఒక వీడియో బైట్ ద్వారా స్పందిస్తూ, ఇప్పటికే పలు ఇతర దేశాల పరిస్థితులు చూస్తున్నాం కాదా, వారితో పోలిస్తే మనం ఒకింత బెటర్ స్థితిలోనే ఉన్నాం. 

 

కాబట్టి ఇప్పటినుండి దేశ ప్రజలం అందరం కూడా ప్రధాని మోడీ విజ్ఞప్తి చేసిన విధంగా తప్పనిసరిగా ఎవరికి వారము  పూర్తిగా ఇళ్లకు పరిమితం అయితే కేవలం అతి కొద్దికాలంలోనే ఈ కరోనా వ్యాధి తరిమికొట్టబడుతుందని పూరి అన్నారు. మనం ప్రస్తుతం కరోనా అనే వార్ జోన్ లో ఉన్నాము..... తప్పదు ప్రతి ఒక్కరం ఈ యుద్ధం చేయాల్సిందే అని పూరి ఎంతో ఆవేదనతో వీడియో పోస్ట్ చేసారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: