మనిషి ఈ భూమి మీద బ్రతికున్నంత కాలం అవి ఉంటూనే ఉంటాయి అనుకున్నారు. వీటిని ఎవడూ ఆపలేరు అన్నారు. ప్రతి రోజు వాటి వల్ల ఏదో ఒక ఫ్యామిలీలో గొడవ జరుగుతూనే ఉంటుంది. మనిషి దైనందిన జీవితంలో ఇప్పటికే అవి భాగమై పోయాయి. అవి లేకుండా ఎలా జీవిస్తారు అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే జరిగింది. అనుకున్నదంతా కరోనా మార్చి వేసింది. వాటిని ఆపే శక్తి కరోనాకి ఉందని నిరూపించుకుంది. అవును. ఇది నిజం. మనం మాట్లాడుకుంటున్నది మనలో భాగమై పోయిన సీరియల్స్ గురించే. ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా కరోనా కారణంగా సీరియల్స్ కూడా బంద్ అయిపోయాయి. ఇంట్లో ఉండే మహిళలకు సీరియల్స్ కంటే కాలక్షేపం మరోటి లేదు. వాళ్లకు థియేటర్స్ బంద్ అయిపోయినా.. బయట పరిస్థితులు ఎలా ఉన్నా పెద్దగా నష్టం ఉండదేమో కానీ సీరియల్స్ ఆగిపోతే మాత్రం ప్రపంచం కూడా ఆగిపోయినంత పని అయిపోతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే వచ్చేసాయి. సీరియల్స్ ఆగిపోయాయి.. ఇంట్లో మగవాళ్లకు కష్టాలు మొదలయ్యాయంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

 

కరోనా కారణంగా మూడు వారాల పాటు ఇల్లు దాటి అడుగు బయటపెట్టడానికి లేదు. దానికి తోడు సినిమా ఇండస్ట్రీపై కూడా ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. ఇండస్ట్రీ అంతా ఉండేది హైదరాబాద్‌లోనే కావడంతో షూటింగ్స్ కూడా అన్నీ నిలిపేసారు. అయితే సినిమాల షూటింగ్స్ ఆగిపోయినా కూడా కొన్ని సీరియల్స్ మాత్రం అలాగే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు కూడా దెబ్బపడింది. మొన్నటి వరకు రియాలిటీ షోస్, డైలీ సీరియల్స్ నాన్ స్టాప్ షెడ్యూల్స్ జరుపుకున్నాయి. ముందు జాగ్రత్తతో వాళ్లు కొన్ని ఎపిసోడ్స్ అయితే షూట్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం అసలు చుక్కలు కనిపించబోతున్నాయి. ఇప్పుడు వీళ్లు కూడా ఇంటికే పరిమితం అయిపోయారు. నటీనటులు కూడా రాలేమంటూ చెప్పేస్తున్నారు.

 

దాంతో సీరియల్ షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. తమకు తాముగా ఇంట్లోనే హౌజ్ అరెస్ట్ చేసుకుంటున్నారు కొందరు. బయటికి వస్తే కచ్చితంగా ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో షూటింగ్స్‌కు వస్తుంటారు. అందులో ఎవడికి కరోనా ఉందో కూడా తెలియదు. అందుకే ఇంటికే పరిమితం అయిపోతున్నారు. రష్మి గౌతమ్.. 'చిరంజీవి లాంటి వాళ్లైతే షూటింగ్స్ ఆపేస్తారేమో కానీ మా లాంటి చిన్న నటులకు అది సాధ్యం కాదు.. నిర్మాతలు షెడ్యూల్ ఫిక్స్ చేస్తే తాము వెళ్లాల్సిందే' అని తెలిపారు. అయితే ఇప్పుడు వాళ్లకు కూడా తప్పదు. ఇంట్లోనే కూర్చోవాల్సిందే. లేకపోతే పరిస్థితులు మరోలా ఉంటాయి.

 

కొందరు సీరియల్ నటులు మాత్రం ఇప్పుడు షూటింగ్స్‌కు రాలేమని నిర్మాతలకు చెబుతున్నారు. బయట పరిస్థితులు అర్థం చేసుకోవాలంటూ వాళ్లకు అర్జీ పెట్టుకుంటున్నారు. అందులో కొందరు అనుమతులు కూడా ఇస్తున్నారు. మొత్తానికి సినిమాలపైనే కాదు ఇప్పుడు బుల్లితెరపై కూడా కరోనా ప్రభావం భారీగానే పడుతుంది. కొన్ని సీరియల్స్ అయితే ఇప్పటికే ఆగిపోయాయి. దాని ప్లేస్‌లో పాత ఎపిసోడ్స్ ప్లే చేసుకుంటున్నారు. సీరియల్స్ కూడా ఆగిపోవడంతో బుల్లితెరకు కూడా భారీ నష్టాలు తప్పవు. ఏదేమైనా డైలీ ఏదొక ఇంట్లో రిమోట్ కోసం ఈ సీరియల్స్ వల్ల గొడవ జరుగుతూనే ఉంటుంది. కరోనా మహమ్మారి దూరం అయ్యే దాకా మళ్లీ సీరియల్స్ మహిళలకు దగ్గరయ్యేలా లేవు. రాను రాను రోజుల్లో ఇది ఎలా ఉండబోతోందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: