కరోనాతో ప్రపంచం గడగడలాడుతుంది. దీనిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరాటం చేస్తున్న ప్రభుత్వాలకి సెలబ్రిటీలందరూ అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు. కొందరు ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తుంటే మరికొందరు స్వయంగా నిత్యవసర వస్తువులను పేదవారికి ఇచ్చి తమ ఉదాత్తతను చాటుకుంటున్నారు. టాలీవుడ్‌లోని సెలబ్రిటీలు ఈ విషయంలో ఒకడుగు ముందే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్‌లో విరాళాలు ప్రకటించిన వారిలో కేవలం నటులే ఉండటం, నటీమణులు లేకపోవడం కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయం తెలుసుకున్నట్లు ఉంది హీరోయిన్ ప్రణీత.. వెంటనే రంగంలోకి దిగింది. ఈ విపత్కర పరిస్థితులలో తన వంతు సాయం అందించడానికి ముందుకు వచ్చి.. ఇలా ముందుకు వచ్చిన నటీమణులలో మొదటి హీరోయిన్‌గా పేరు కొట్టేసింది.


హీరోయిన్ ప్రణీత తన వంతు సాయంగా ఒక్కో కుటుంబానికి రూ. 2000 చొప్పున 50 కుటుంబాలకు లక్ష రూపాయలను విరాళంగా అందిచారు. ఎవరైతే పనుల్లేక ఇబ్బంది పడుతున్నారో వారికి ఈ సహాయం అందిస్తానని ప్రణీత తెలిపారు. ప్రస్తుతం ప్రణీత చేతుల్లో సరైన సినిమా లేకపోయినప్పటికీ తన వంతుగా రూ. లక్ష ప్రకటించి ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలిచింది. తర్వాత కరోనా పై స్పందించిన మరో హీరోయిన్ లావణ్య త్రిపాఠి. చిరంజీవి తలపెట్టిన కరోనా క్రైసిస్ ఛారిటీకి (సీసీసీ) తన వంతు సామాజిక బాధ్యతగా లక్ష రూపాయలు విరాళంగా ప్రకటించింది. మరికొంత మంది హీరోయిన్లు మేము సైతం అంటూ కరోనా నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్తూ వీడియోలు పోస్ట్ చేసి తమ సామాజిక బాధ్యతను నెరవేర్చారు. వారిలో అక్కినేని సమంత, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్, శ్రియా, ఈషా రెబ్బా, త్రిష, వరలక్ష్మీ శరత్ కుమార్, నిహారిక కొణిదెల లాంటి వారు ఉన్నారు. ఇప్పటి దాకా విరాళాలు అందించిన హీరోయిన్లు ప్రణీత, లావణ్య త్రిపాఠి మాత్రమే. వీళ్ళను చూసైనా మిగతావారు కూడా వీరి దారిలో పయనిస్తారేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: