కరోనా కల్లోలానికి దేశంలోని వ్యవస్థలన్నీ నిస్తేజమైపోయాయి. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. షూటింగులన్నీ బంద్ అయిపోయాయి. కానీ ఓ సినిమా టీమ్ మాత్రం జోర్డాన్ దేశంలో షూటింగ్ కు వెళ్లి ఇరుక్కుపోయింది. అంతర్జాతీయ విమాన సర్వీసులన్నీ క్యాన్సిల్ అయిపోవడంతో టీమ్ అంతా అక్కడే చిక్కకుపోయారు. మళయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా ‘ఆడు జీవితం’ అనే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. కథానుసారం జోర్డాన్ సమీపంలోని వాడి రమ్ ఎడారిలో షూటింగ్ కు వెళ్లిన టీమ్ కు కోరోనా వైరస్ షాక్ ఇచ్చింది.

 

 

ఈ మేరకు ట్విట్టర్ లో ఓ మెసేజ్ పోస్ట్ చేశాడు హీరో పృథ్వీరాజ్. ‘నిజానికి ఏప్రిల్ 2 వరకూ షూటింగ్ ఉంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా షూటింగ్ కు ఇచ్చిన పర్మిషన్ ను 24వ తేదీన క్యాన్సిల్ చేసింది అక్కడి ప్రభుత్వం. ఈలోపు విమానసర్వీసెస్ కూడా ఆగిపోవడంతో మేము ఇండియాకు రాలేకపోయాం. ఇక్కడ మా సేఫ్ కోసం ఓ జోర్డాన్ డాక్టర్ ను కూడా అపాయింట్ చేశారు. ఆహారం కొరత లేకుండా చూసుకుంటున్నారు. మాలాగే ఇండియాకు రాలేకపోయిన ఎందరో బయట దేశాల్లో ఉండిపోయారు. అందరూ క్షేమంగా ఇండియా రావాలని కోరుకోండి’ అంటూ ట్వీట్ చేశాడు.

 

 

పృథ్వీరాజ్ తన అభిమానులకు, కేరళ ప్రజలకు తాను సేఫ్ గానే ఉన్నానని.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో కేరళీయులంతా ఊపిరి పీల్చుకున్నారు. చిత్ర నిర్మాత బ్లెస్సీ తమ పరిస్థితిపై కేరళ ప్రభుత్వానికి తెలిపాడు. దీనిపై కేరళ సీఎం కూడా జోర్డాన్ లోని ఇండియన్ ఎంబసీలో ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడే వరకూ వారు జోర్డాన్ లోనే ఉండిపోనున్నారు. పరిస్థితులు చక్కబడ్డాక ఇండియా వస్తారో షూటింగ్ కు పర్మిషన్ ఇస్తే జరుపుకుంటారో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: