సినిమా అనేది మన దేశంలో ఎక్కువ మంది ప్రజానీకానికి ఎంటర్టైన్మెంట్ సాధనం. యాంత్రిక జీవితానికి అలవాటు పడిన ఈ జనరేషన్ లో ప్రస్తుతం సినిమా ఒక్కటే వారికి ఆటవిడుపు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక చిత్రాలు నిర్మిస్తున్న దేశాలలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. సౌత్ ఇండియాలో కోలీవుడ్ మొదటి స్థానంలో ఉండగా, టాలీవుడ్ రెండో స్థానంలో ఉంది. కొన్ని వేల కుటుంబాలు సినీ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం కొన్ని వేల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు కాగా మిగిలినవన్నీ తక్కువ బడ్జెట్ తో నిర్మించిబడిన చిన్న సినిమాలు. కొన్ని సినిమాలు విజయాలు సొంతం చేసుకుంటుండగా మరికొన్ని పరాజయాన్ని చవిచూస్తూ ఉంటాయి. అయితే ఒక సినిమా హిట్టా ఫ్లాపా అని నిర్ణయించేవి ఆ సినిమా కలెక్ట్ చేసిన వసూళ్లు.

 

కాలానుగుణంగా సినిమా కూడా తన రూపాన్ని మార్చుకుంటూ వస్తుంది. ఒకప్పుడు సినిమా ప్రదర్శించబడిన థియేటర్లను బట్టి, రోజులను సినిమా విజయాన్ని నిర్ణయించేవారు. ప్రస్తుతం ఆ సినిమా సాధించిన వసూళ్లను బట్టి అది ఏ స్థాయి విజయం సాధించిందో నిర్ణయిస్తున్నారు. ఒక సినిమా భవితవ్యం విడుదలైన వారం రోజులలో నిర్ణయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో చిన్న సినిమాలు తమ మనుగడను కాపాడుకోవడం కష్టంగా మారింది. దీనికి తోడు పైరసీ భూతం సినిమాను ఎప్పటికప్పుడు దెబ్బ తీయడానికి రెడీగా ఉంటుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి సినిమా విడుదలైన కొన్ని రోజుల్లోనే డిజిటల్ ప్లాటుఫార్మ్స్ లో రిలీజ్ చేస్తున్నారు. పైరసీని తట్టుకొని నిర్మాతలు తాము పెట్టిన పెట్టుబడి రాబట్టుకోవడం కోసం అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ వంటి ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. విడుదలైన కొన్ని రోజుల్లోనే సినిమాలు అమెజాన్, నెట్ ప్లిక్స్, సన్ నెక్ట్స్ లలో అందుబాటులో ఉండటంతో సగటు ప్రేక్షకుడిని థియేటర్ల దాకా తీసుకురావడం చాలా కష్టంగా మారింది. దీని వల్ల చిన్న సినిమా థియేటర్లలో లాంగ్ రన్ కోల్పోతోంది. టాలీవుడ్ మొత్తం తమ భుజాల మీద వేసుకొని ప్రమోట్ చేసిన రీసెంట్ గా రిలీజైన ఒక సినిమానే ఉదాహరణగా తీసుకుంటే, ఈ సినిమా విడుదలైన పది రోజుల్లోనే ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్స్ లో దర్శనమిచ్చింది. నిర్మాతలు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా అంతో ఇంతో వసూళ్లు రాబట్టుకుంటున్నప్పటికీ, వీటి వల్ల చిన్న సినిమాలు తమ మనుగడ కోల్పోతున్నాయనేది వాస్తవమేనని సినీ విశ్లేషకులు అంగీకరిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: