మెగా స్టార్ చిరంజీవి దాసరి పెద్దరికాన్ని తనకు తానుగా తీసుకుని కరోనా సమస్యతో ఉపాది కోల్పోయిన ఇండస్ట్రీ వర్కర్స్ ను ఆదుకోవడానికి ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ ఎకౌంట్ కు విరాళాల రూపంలో అనూహ్య స్పందన వచ్చింది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ఎకౌంట్ కు ఇప్పటి వరకు విరాళాల రూపంలో 6.2 కోట్లు రావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


ఇండస్ట్రీలో పనిచేసే 24 క్రాఫ్ట్స్ విభాగాలకు చెందిన చిన్నచిన్న పనులు చేసుకునే వర్కర్స్ కు అదేవిధంగా చిన్నచిన్న వేషాలు వేసుకుంటూ తమ జీవితాన్ని కొనసాగించే ఎక్స్ ట్రా ఆర్టిస్టులకు షూటింగ్ లు ఆగిపోయిన సందర్భంగా వారికి ఎటువంటి ఆర్ధిక సమస్యలు ఏర్పడకుండా వారందరికీ చేతనైన సహాయం చేయడానికి ఈ ట్రస్ట్ ఏర్పడింది. ఇక్కడవరకు బాగానే ఉన్నా ఈ ట్రస్ట్ ఎకౌంట్ పేరుకు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ పేరు జతకలవడం పై కొందరు ఆశ్చర్య పడుతూ విమర్శలు చేస్తున్నారు.  


చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ – కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో ఈ ఎకౌంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కొందరు చిరంజీవి వ్యతిరేకులు ఈ విషయమై విభిన్నంగా స్పందిస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఎందరో సహాయ సహకారాలతో ఈ ట్రస్ట్ ఏర్పడితే దానికి చిరంజీవి పేరు ఏమిటి అంటూ విమర్శలు చేస్తున్నారు. 


అయితే దీనికి సంబంధించి అసలు వాస్తవాలు వేరు. ఒక ట్రస్ట్ ఏర్పడి దాని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చిన తరువాత కాని ఆ ట్రస్ట్ పేరు మీద బ్యాంక్ లు ఎకౌంట్ ఓపెన్ చేయవు. ఇప్పుడు దేశం అంతా లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితులలో కరోనా క్రైసిస్ ఛారిటీ పై ఏకౌంట్ ఓపెన్ చేయడం జరగని పని దీనితో ఏదోవిధంగా అనుకున్న పనులు పూర్తి అవ్వాలి అన్న ఉద్దేశ్యంతో ఈ కరోనా క్రైసిస్ ట్రస్ట్ ను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు లింక్ చేసారు అన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే అసలు వాస్తవాలు తెలియక చిరంజీవి వ్యతిరేకులు ఈ విషయాన్ని భూతద్దంలో చూస్తూ అనవసరపు రాద్దాంతం చేస్తూ ఉదాత్తమైన ట్రస్ట్ లక్ష్యం పై బురద జల్లుతున్నారు అంటూ చిరంజీవి అనుకూల వర్గం కామెంట్ చేస్తోంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: