ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన  సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్యలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మంచి సామజిక అంశాన్ని తీసుకుని, దానిని ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు పలు కమర్షియల్ అంశాలు జోడించి తీయడంలో దిట్టగా పేరుగాంచిన శివ, ఈ సినిమాని కూడా అదే విధంగా ఎంతో జాగ్రత్తగా తీస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. మెగాస్టార్ సరసన రెండవసారి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

IHG

అయితే దీని తరువాత మెగాస్టార్ చేయబోయే తదుపరి సినిమా విషయమై కొద్దిరోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో కొంత చర్చ జరుగుతోంది. వాస్తవానికి మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ఉందని అప్పట్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయవిధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో మెగాస్టార్ స్వయంగా తన అభిరుచిని వెలిబుచ్చారు. అలానే అదే వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అతి త్వరలో తాను ఒక సినిమా చేయబోతున్నట్లు మెగాస్టార్ ప్రకటించడం జరిగింది. అది కూడా డివివి దానయ్య గారి బ్యానర్ లో ఉంటుందని మెగాస్టార్ అన్నారు. 

 

అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఇప్పటికే త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో ఒక సినిమా అనౌన్స్ చేసి ఉండడంతో ఆయన పూర్తిగా ఆ సినిమా కథపైనే కసరత్తు చేస్తున్నారని, కాబట్టి ఏ విధంగా చూసుకున్నా వచ్చే ఏడాది మార్చి సమయం వరకు త్రివిక్రమ్ అందుబాటులో ఉండే పరిస్థితి లేదు కనుక, ఇక ఇప్పట్లో మెగాస్టార్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా లేనట్లే అంటున్నారు. అదిమాత్రమే కాక ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా, అలానే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న పవన్ కళ్యాణ్, వాటి అనంతరం త్రివిక్రమ్ తో చేయడం ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లు సమాచారం. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే మెగాస్టార్, త్రివిక్రమ్ మూవీ పూర్తిగా అటకెక్కినట్లే అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపికపట్టాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: