చైనాలో పుట్టిన వైరస్ దేశాలను దాటుకొని తెలుగు రాష్ట్రాలకు వస్తుందా అంటే 'ఆ ఏమొస్తుందిలే' అన్నారు. ఎక్కడో చైనాలో ఉన్న జబ్బు మన ఇండియాకు రావడం.. అందులోనూ మన ఇళ్లల్లోకి రావడమేంటి అంటూ నవ్వుకున్నారు. కానీ కొన్ని రోజులుగా కరోనా చుక్కలు చూపిస్తుంది. దెబ్బకు అన్నీ బంద్ చేసి ఇంట్లో కూర్చునేలా చేసింది ఈ వైరస్. ఇక ఇప్పుడు సినిమా ఇండస్ట్రీపై కూడా ఈ వైరస్ ప్రభంజనంలా విరుచుకుపడుతుంది. దేన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు.

 

ఇప్పటికే ఇండియాలో కరోనా మరణాలు కూడా మొదలైపోవడంతో లాక్ డౌన్ ప్రకటించారు. ఒక్కొక్కటిగా అన్ని సినిమాలను వాయిదా వేసుకున్నారు నిర్మాతలు. సినీ పరిశ్రమ లాక్ డౌన్ అవడంతో సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిపేసారు. రోజురోజుకీ కరోనా కేసులు అధికం అవుతుండటంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రభావం టాలీవుడ్‌పై దారుణంగా పడుతుంది. ఇప్పటికే కోట్ల రూపాయలు నష్టపోతున్నారు నిర్మాతలు. అనుకోకుండా వచ్చిన ఈ కరోనా మహమ్మారితో చిన్న నిర్మాతలు రోడ్డున పడుతున్నారు. పెద్ద నిర్మాతలకు కూడా వడ్డీల రూపంలో కోట్ల నష్టం వస్తుంది. ఈ వైరస్ కారణంగా రెగ్యులర్‌గా ఏదో పక్కూరికి వెళ్లొచ్చినట్లు బ్యాంకాక్, థాయ్ ల్యాండ్ లాంటి దేశాలు తిరిగేసి వచ్చే మన స్టార్స్ కూడా అంతా ఇంట్లోనే ఉన్నారు. పర్సనల్ టూర్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని అనుకోకుండా వచ్చిన సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు.

 

ఇంటికే పరిమితమైన ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియా మరియు టీవీ. ఇంట్లో కాలక్షేపం చేసే ప్రతి ఒక్కరికి ఫస్ట్ గుర్తొచ్చేవి ఇవే. ఈ నేపథ్యంలో ఉగాది సందర్భంగా టీవీలో ప్రసారమైన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా తెలుగు సినిమాల్లోనే హైయెస్ట్ టీఆర్పీ సాధించడమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. డైలీ ఎన్నో ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉండే ఛానళ్లు కూడా ఇప్పుడు సీరియల్స్ రిపీట్ టెలికాస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే షూటింగ్ చేసిన ఎపిసోడ్స్ టెలికాస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు షూటింగ్స్ ఆగిపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. కానీ సినిమాల ద్వారా ఇవి బాగానే ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. కరోనా వల్ల సిల్వర్ స్క్రీన్ ఒకరకంగా లాభ పడిందనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: