కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైపోయారు. ఈ ఉపద్రవానికి ఉపాధి కోల్పోయిన వారిలో సినీ పరిశ్రమ కూడా ఉంది. షూటింగ్స్ లేకపోతే ఆర్ధికంగా ఇబ్బంది పడే కుటుంబాలు ఎన్నో టాలీవుడ్ లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వారిని ఆదుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ముందుకొచ్చారు. కార్మికుల కోసం కోటి రూపాయలు విరాళంగా ప్రకటించి ‘సీసీసీ’ ని ఏర్పాటు చేసి చైర్మన్ గా ఉన్నారు. చిరంజీవి తీసుకున్న నిర్ణయానికి స్పందించిన తెలుగు సినీ సెలబ్రిటీలు సీసీసీకి భారీ విరాళాలు ప్రకటించారు. దీనికి తమ్మారెడ్డి భరద్వాజ, శంకర్ తదితరులను సెక్రటరీలుగా నియమించారు.

 

 

ఇప్పటికి వచ్చిన విరాళాలతో ఈ ట్రస్ట్ నుంచి సేవలు 5వ తేదీ నుంచి సేవా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని తమ్మారెడ్డి, శంకర్ ప్రకటించారు. ఇప్పటికే నిత్యావసరాలు అన్నీ సిద్ధమయ్యాయని ఆదివారం నుంచి నిత్యావసరాలు ఇంటింటికీ పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఆర్ధికంగా నిరుపేద కార్మికులను గుర్తిస్తున్నామని శంకర్ ఆధ్వర్యంలో జాబితా సిద్ధమవుతోందని భరద్వాజ్ తెలిపారు. వివిధ అసోసియేషన్లు ముందుకొచ్చి కార్మికుల వివరాలను తెలపాలని కోరారు. ఆర్ధిక అవసరాలను బట్టి జాబితా సిద్ధం చేసి ఇవ్వాలని శంకర్ కోరారు. లాక్ డౌన్ సమయంలో సినీ కార్మికులు ఎవరూ ఇబ్బందులు పడకుండా చూడడమే సీసీసీ ప్రధాన ఉద్దేశమని శంకర్ అంటున్నారు.

 

 

భరద్వాజ్ మాట్లాడుతూ.. ‘రామ్ చరణ్–ఉపాసన స్పందించి అపోలో హాస్పిటల్స్ ద్వారా 25లక్షల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేసేందుకు ముందుకొచ్చారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే 500 నుంచి 1000 రూపాయల వరకూ మందులు ఉచితంగా పొందవచ్చు. ఈ సీసీసీ చారిటీని నిరంతరంగా కొనసాగించేందుకు చిరంజీవి ప్రణాళికలు తయారు చేయిస్తున్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఇది మంచి నిర్ణయం’ అని భరద్వాజ్ తెలిపారు. సీసీసీకి విరాళాలు ఇస్తున్న వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: