యావత్ సినీ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్'.. దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' లాంటి సినిమా తర్వాత రెండేళ్ల విరామం తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందిస్తున్న సినిమా ఇది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. టైటిల్ లోగో మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన రాజమౌళి చరణ్ పుట్టినరోజు కానుకగా 'భీమ్ ఫర్ రామరాజు' వీడియోతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి తీసుకెళ్లాడు. దీంతో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమాని ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో 'అల్లూరి సీతారామరాజు'గా రామ్ చరణ్, 'కొమరం భీమ్‌'గా ఎన్టీఆర్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా జనవరి 8న విడుదల కానున్న ఈ చిత్రం వాయిదా పడబోతోంది అంటూ ఈ మధ్య వార్తలు వస్తున్నాయి.

 

ఈ సినిమాను  2020లో జులై 30న విడుదల చేస్తామని గతంలో రాజమౌళి, చిత్ర నిర్మాతలు మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ జరగకపోవడంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. అయితే కొద్ది రోజుల క్రితం నార్త్ ఇండియాలో మొదలు కావలసిన షెడ్యూల్ ఆగిపోయింది. దీనితో మరో మారు ఆర్.ఆర్. ఆర్ విడుదల వాయిదా పడడం ఖాయం అంటూ ప్రచారం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించి కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే చిత్ర పరిశ్రమ స్వచ్ఛందంగా షూటింగ్స్ కి బంద్ ప్రకటించడం జరిగింది. దీని కారణంగా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కి సైతం బ్రేక్ పడింది. దీంతో అనుకున్న టైమ్ కి ఆర్.ఆర్.ఆర్ విడుదల కాదంటూ న్యూస్ స్ప్రెడ్ అయింది.

 

అయితే దీనిపై చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య స్పందించారు. ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదలపై వస్తున్న పుకార్లను ఖండించారు. చెప్పిన ప్రకారం ఆర్.ఆర్.ఆర్ వచ్చే ఏడాది జనవరి 8న విడుదల అవుతుందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికతో అయన మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ఆర్.ఆర్.ఆర్ విడుదల వాయిదా పడుతుందనే వార్తలలో నిజం లేదని చెప్పారు. ఇప్పటికే చాలా వరకు గ్రాఫిక్ వర్క్ పూర్తయిందని, మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తి చేసి చెప్పిన సమయానికి చిత్రాన్ని విడుదల చేస్తామని వాయిదా పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: