ఒక మ‌హావృక్షం ముందు చిన్న చిన్న చెట్లు ఎద‌గ‌లేవు అంటారు. అది ఏ రంగానికైనా వ‌ర్తిస్తుంది. సినిమా రంగానికైనా అంతే. ఇక్క‌డ పెద్ద పెద్ద త‌ల‌కాయ‌ల ముందు టాలెంట్ ఉన్న‌ప్ప‌టికీ చాలా మంది పైకి రాలేక‌పోయారు. ముఖ్యంగా హీరోల విష‌యంలో ఇలాంటి వారి లిస్ట్ చాలానే ఉంద‌ని చెప్పాలి. అందం, టాలెంట్‌, బ్యాక్‌గ్రౌండ్ స‌పోర్ట్ అన్నీ ఉన్న‌ప్ప‌టికీ మొద‌ట్లో హీరోలుగా టాప్ రేంజ్‌లో ఉన్నారు. త‌ర్వాత హీరోల స్టార్‌డ‌మ్ తో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారిపోవ‌డం, పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోవ‌డం జ‌రిగింది. అలా టాప్ హీరోల స్టార్‌డ‌మ్‌కి బ‌లైపోయిన హీరోలు ఎవ‌రి వ‌ల్ల ఎవ‌రి కెరియ‌ర్‌కి  ఎంత న‌ష్టం జ‌రిగింది లాంటి వీష‌యాలు గురించి తెలుసుకుందాం...

 

పాత త‌రం నుంచి చూసుకుంటే ఎన్టీఆర్ ఏఎన్నార్‌లు రాక‌ముందు కొంత మంది హీరోలు ఒక వెలుగు వెలిగారు. కానీ ఎప్పుడైతే వీరిద్ద‌రూ ఎదిగారో మిగ‌తావారి ప్రాభ‌వం త‌గ్గిపోవ‌డం మొద‌ల‌యింది. వారిలో ముఖ్యంగా కాంతారావ్ అని చెప్పాలి. జాన‌ప‌ద హీరోగా ప్ర‌సిద్ధి గాంచి క‌త్తికాంతారావుగా పేరు తెచ్చుకున్న ఆయ‌న మంచి స్టార్‌డ‌మ్‌ని చ‌విచూశారు. అదే టైమ్‌లో ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో న‌టించ‌డంతో ఆయ‌న‌కు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. అలాగే పౌరాణిక చిత్రాల్లో ఒక వెలుగు వెలిగిన హీరో హ‌రినాధ్ దేవుడి గెటప్స్‌కి క‌రెక్ట్‌గా స‌రిపోయే రూపం. అయితే కృష్ణుడు, రాముడు గెట‌ప్‌లు ఎన్టీఆర్ వేయడం మొద‌లు పెట్టాక హ‌రినాధ్ సెకండ్ హీరోగా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మిగిలిపోయారు.

 

ఇక జ‌గ్గయ్య‌, చ‌లం లాంటి వారు మొద‌ట్లో హీరోగా బాగానే పేరు తెచ్చుకున్నారు. ఏఎన్నార్ సాంఘిక చిత్రాల్లో టాప్ హీరోలుగా ఎదిగాక జ‌గ్గ‌య్య సెకండ్ హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న స్థానం ప‌దిలం చేసుకోగా చ‌లంకి అవ‌కాశాలు పూర్తిగా త‌గ్గిపోయాయి. ఇలా ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో ఏఎన్నార్ సాంఘిక చిత్రాల్లో పూర్తి  ఆధిప‌త్యం చేప‌ట్ట‌డంతో మిగ‌తా ఏ హీరోలు కూడా వారికి పోటీ ఇవ్వ‌లేక పోయారు. కొంత మంది విల‌న్స్‌గా మ‌రికొంత మంది ఆర్టిస్ట్‌లుగా మిగిలిపోయారు. మ‌రికొంత మందైతే పూర్తిగా క‌నుమ‌రుగైపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: