మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆచార్య' సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్య లీకైన చిరు లుక్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేలా చేసింది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి కాగా కరోనా వైరస్ కారణంగా కొనసాగుతున్న లాక్ డౌన్ తో షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే కొరటాల శివ ఈ చిత్ర కథను చిరంజీవికి చెప్పినప్పుడే చిత్రంలోని మరో కీలక పాత్ర గురించి స్పెషల్ గా చెప్పాడట. ఈ పాత్రలో మహేష్ నటిస్తున్నారని చాలా కాలం ప్రచారం జరిగింది. ఆయనకు భారీ రెమ్యూనరేషన్ చెల్లించి తీసుకున్నారని అనేక మాధ్యమాలలో ప్రచురించడం జరిగింది కూడా. తర్వాత బడ్జెట్ పరిమితుల వల్ల ఆ పాత్రని మహేష్ చేయడం లేదు, రామ్ చరణ్ ని ఫైనలైజ్ చేసారంటూ మరో న్యూస్ బయటకి వచ్చింది.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన తాజా ఇంటర్వ్యూ లో ఈ విషయం పై స్పందించారు.  మెగాస్టార్ మాట్లాడుతూ.. ఫస్ట్ నుండి  ఈ మూవీలోని ఓ పాత్ర కోసం కొరటాల చరణ్ నే అనుకుంటున్నారు. అయితే మహేష్ పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు. మహేష్ నాకు బిడ్డతో సమానం, అతనితో కలిసి నటించడం నాకు ఆనందం కలిగించే అంశం. కానీ ఈ చిత్రం కోసం మహేష్ ని అసలు అనుకోలేదు. చరణ్ వాళ్ళ అమ్మ సురేఖ కోరిక కూడా చరణ్ ఈ మూవీలో నటించాలని. అయితే  ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న చరణ్ డేట్స్ కావాలంటే రాజమౌళి ఒప్పుకోవాలి. కొరటాల, రాజమౌళి కాంప్రమైజ్ అయితేనే ఇది సాధ్యం అవుతుందని అన్నారు.

ఏదేమైనా రామ్ చరణ్ ఆ పాత్రలో నటించే అవకాశం ఉందనేది మాత్రం దీని ద్వారా క్లారిపై అయ్యిందనే చెప్పాలి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ - రామ్ చరణ్ కొణెదల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: