ప్రస్తుతం కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధి ఎప్పుడు ఎవరికి ఎలా సోకుతుందో తెలియని ఆందోళన పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి కరోనా సోకగా వేలమంది ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈ వ్యాధిని ఇప్పుడే అంతం చేయకపోతే మున్ముందు దీని ప్రభావం మరింతగా పెరుగుతుందని గుర్తించిన పలు దేశాలు ఇప్పటికే తమ ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేస్తూ లాకౌట్ ప్రకటించాయి. మనదేశంలో కూడా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ లాకౌట్ వలన ముఖ్యంగా ప్రజల మధ్య సామాజిక దూరం తగ్గి కరోనా మరింతగా వ్యాప్తి చెందకుండా ఉంటుందని, అలానే ప్రజలు అందరూ కూడా దీని వెనుక ఉన్న వాస్తవాన్ని గ్రహించి ప్రభుత్వానికి సహకరించాలని ప్రధాని సూచించారు. దీని వలన అన్ని వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో దినసరి కూలీలు, శ్రామికులు, కార్మికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

 

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుండి మేముసైతం పలువురు నటీనటులు, దర్శకులు, సాంకేతికనిపులు, తమకు తోచిన విధంగా కరోనా బాధితుల సహాయార్ధం విరాళం ఇచ్చారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ తమకు సాధ్యమైనంత సహాయం చేస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌ముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ సంస్థ క‌రోనా నివార‌ణ‌కు త‌మ వంతుగా ఆర్ధిక స‌హ‌కారం అందించ‌డానికి ముందుకొచ్చారు. ఆదిత్య మ్యూజిక్ అధినేత‌లు ఉమేశ్ గుప్త‌, సుభాష్ గుప్త‌, దినేశ్ గుప్త‌, ఆదిత్య గుప్త‌లు తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రివ‌ర్య‌లు శ్రీ క‌ల్వ‌కుంట్ల తారక‌ రామారావు గారిని క‌లిసి క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌కు గాను సీఎం రిలీఫ్ ఫండ్ కు 31 లక్షలు విరాళం అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ సినిమాటోగ్రాఫి శాఖ మంత్రివర్యుల శ్రీ త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

 

ఈ సంద‌ర్భంగా ఆదిత్య మ్యూజిక్ మేనెజింగ్ డైరెక్ట‌ర్ ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ క‌రోనా కార‌ణంగా యావ‌త్ మాన‌‌వాళి ఇబ్బందుల్లో ప‌డింది. ఈ మ‌హ‌మ్మారి నివార‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌లు చాలా అభినంద‌నీయం. అలానే ఈ లాక్ డౌన్ కి స‌హ‌క‌రిస్తూ ప్ర‌జ‌లంతా సేఫ్ గా ఇళ్ల‌కే ప‌రిమిత‌మవ్వడంతో ఈ వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్టాం అన్ని అన్నారు. ‌ఇలాంటి క‌ఠిన‌మైన స‌మ‌యంలో సైతం ఎలాంటి ప్ర‌మాదాల్ని లెక్క చేయ‌కుండా ఎంతో మంది పోలీసులు, వైద్య, శానిట‌రీ సిబ్బంది మ‌నంద‌రి కోసం నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు. వారిని కాపాడుకోవడం మ‌నంద‌రి బాధ్య‌త‌. ప్ర‌భుత్వం వారు చేస్తున్న సూచ‌న‌లు త‌ప్ప‌క పాటిస్తూ ఇలానే సెల్ఫ్ ఐసోలేష‌న్ లో ప్ర‌జ‌లంతా ఉంటే తొంద‌ర్లోనే సంపూర్ణంగా కరోనా నివార‌ణ జ‌రిగే అవ‌కాశం ఉందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: