కరోనా వైరస్‌ మహమ్మారి పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించడానికి పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. సమాజం నుండి మనం తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైన కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి కూడా ముందుకు రావాలి. ఇపుడు మన సెలబ్రిటీలు అదే చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నారు. ఈ విషయంలో మన టాలీవుడ్ యాక్టర్స్ ముందే వున్నారని చెప్పుకోవచ్చు. కరోనా వైరస్ నేపథ్యంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులకు పని లేకుండా పోయింది. ఇందులో భాగంగా టాలీవుడ్ సినీ నటులు 'కరోనా క్రైసెస్ ఛారిటీ'ని ఏర్పాటు చేసి తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇంకోవైపు తమిళనటీనటులు కూడా దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్మికులకు తమ వంతు ఆర్ధిక సాయం చేస్తున్నారు. మరికొంతమంది స్వయంగా పేద కళాకారులకు, కార్మికులకు ఉచితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మందులు ఇచ్చి వారికి అండగా ఉంటున్నారు. కొంతమంది శానిటైజర్స్, మాస్కులను పంపిణీ చేస్తూ సేవాగుణాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ యాక్టర్ మోహన్ బాబు.. తన పెద్ద కొడుకు మంచు విష్ణుతో కలిసి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 

మంచు మోహన్ బాబు - విష్ణు కలిసి కరోనా బాధితులను ఆదుకోవడంలో తమ వంతు బాధ్యతగా ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతంలోని ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకొని గ్రామస్థుల అవసరాలను తీరుస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆ గ్రామాలలోని పేదవారికి డైలీ రెండు పూటలా భోజనం పెట్టి వారి ఆకలిని తీరుస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఎత్తేసే దాకా మంచు ఫ్యామిలీ ఈ సహాయాన్ని కొనసాగిస్తారట. అంతేకాకుండా ప్రతిరోజూ ఎనిమిది టన్నుల కూరగాయలను ఆ గ్రామాలలో పంపిణీ చేస్తున్నారు. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా సష్టించిన అలజడికి బలైపోయిన వారిలో కొంతమందిని మంచు ఫ్యామిలీ ఈ విధంగా ఆదుకుంటోంది. గతంలో కూడా మోహన్ బాబు చాలా సందర్భాల్లో తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తన విద్యాసంస్థలలో పేదవారికి ఉచిత విద్యను కూడా అందిస్తున్నారు. మంచు మనోజ్ సైతం కరోనా బాధితుల సహాయార్థం విరాళాలు అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీ తమ సేవాగుణాన్ని చాటుకున్నారని అందరూ అభినందిస్తున్నారు. ఏదేమైనా మంచు వారు పైకి చూడటానికి కఠినంగా కనిపించినా మనసు మాత్రం నిజంగానే మంచు లాంటిది అని అందరూ ఆయన చేసిన మంచి పనిని మెచ్చుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌ను అందరూ పాటించాలని మోహన్ బాబు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: