టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలను విపరీతంగా భయకంపితులను చేస్తున్న కరోనా మహమ్మారి వలన చాలా దేశాలు తమ ప్రజలను ఇళ్లనుండి బయటకు రాకుండా పూర్తిగా కొన్ని వారాల పాటు లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మన దేశాన్ని కూడా ఏకంగా 21 రోజుల పాటు లాకౌట్ చేస్తున్నట్టు మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. ప్రజలు పూర్తిగా సామాజిక దూరాన్ని తప్పకుండా పాటించాలని, అలానే ఏదైనా ముఖ్యమైన అవసరం ఉంటేనే తమ ఇళ్ల నుండి బయటకు రావాలని, మరీ ముఖ్యంగా ఇంటి పరిసరాలు ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు జారీ చేయడం జరిగింది. 

 

అలానే ప్రతి ఒక్కరూ కూడా తమ చేతులను రోజులో ఎక్కువ సార్లు శుభ్రం చేసుకోవాలని, దగ్గు, తుమ్ము వంటివి వచ్చినపుడు గట్టిగా చేతిని, లేదా కర్చీఫ్, టిష్యు వంటివి అడ్డుపెట్టుకోవడంతో పాటు అందరూ తప్పనిసరిగా ముఖానికి మాస్కులు ధరించాలని పలువురు డాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇటువంటి విపత్కర సమయంలో ప్రజలకు పూర్తిగా రక్షణనిస్తూ తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వృత్తిని నిర్వహిస్తున్న పోలీసులకు ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అంటున్నారు పలువురు ప్రజలు, ప్రముఖులు. ఎక్కడి ప్రజలను అక్కడే వారి వారి ఇళ్లకు పరిమితం చేస్తూ, రేయింబవళ్లు పహారా కాస్తూ మనకు సేవ చేస్తున్న పోలీసు వారిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇకపోతే నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పోలీసులు ఇటువంటి విపత్కర సమయంలో పడుతున్న కష్టాన్ని గుర్తించి తనవంతుగా సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా స్పందించారు. 

 

మొదట తనవంతుగా కరోనా బాధితులకు రెండు తెలుగు రాష్ట్రాలకు గాను కోటి రూపాయలతో పాటు, మరొక ఇరవై ఐదు లక్షలు కరోనా విపత్తు నిధికి విరాళంగా చెల్లించి తన గొప్ప మనసు చాటుకున్న సూపర్ స్టార్, ఇటీవల కొద్దిరోజులుగా తన కుమార్తె సితారతో పాటు ప్రజలకు ఈ మహమ్మారి కరోనా పట్ల పాటించవలసిన జాగ్రత్తలను తెలియచేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో  మన ఆరోగ్య రక్షణ కోసం ఎంతో శ్రమిస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న తెలంగాణ, హైదరాబాద్ పోలీసులకు మన ప్రజలందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెల్పుతున్నాను అంటూ రెండు ట్వీట్స్ చేశారు. కాగా మహేష్ బాబు చేసిన ఆ ట్వీట్స్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మద్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి......!!

మరింత సమాచారం తెలుసుకోండి: