ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో మన దేశంతో పాటు మిగతా ఇతర దేశాలు కూడా పూర్తిగా లాకౌట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మన దేశాన్ని మొత్తంగా 21 రోజులపాటు లాకౌట్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక ఈ లాకౌట్ తో ప్రజలు అందరూ కూడా తమ ఇళ్లకే పరిమితం అయి బయటకు వచ్చే అవకాశం ఉండదు కనుక, మెల్లగా వారి మధ్య సోషల్ డిస్టెన్సింగ్ పెరిగి కరోనా మరింతగా వ్యాప్తి కాదని తలచి ప్రభుత్వాలు ఈ విధానాన్ని అనుసరించాయి. అయితే ఈ లాకౌట్ వలన ప్రధానంగా దిగువ తరగతుల వారి పరిస్థితి ఎంతో ఇబ్బందికరంగా మారడంతో పాటు వారిలో కొంతమందికి అయితే తినడానికి తిండి కూడా లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఇప్పటికే కొంతమేర సాయం అందిస్తుండగా, మేము సైతం అంటూ పలు రంగాలకు చెందిన ప్రముఖులు తమ దయా గుణంతో కొంత మేర విరాళాలు ప్రకటిస్తున్నారు. 

 

ఆ విధంగా మన మన టాలీవుడ్ నుండి కూడా పలువురు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతికనిపుణులు ఇప్పటికే విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ముఖ్యంగా దాదాపుగా స్టార్ హీరోలు అందరూ కూడా భారీగానే విరాళాలు ప్రకటించడం జరిగింది. అయితే హీరోలు ప్రకటించిన విరాళాల పై నేడు ఒక మీడియా ఛానల్ వీడియోలో కొన్ని సంచలన కామెంట్స్ చేసారు ప్రముఖ డాన్స్ మాస్టర్ అయిన రాకేష్ మాస్టర్. చిరంజీవి, రామ్ చరణ్, బాలయ్య, ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ, ఇలా చెప్పుకుంటూ పోతే తాము అంత ఇచ్చాము ఇంత ఇచ్చాము అని చెప్పుకుంటున్న ఈ హీరోలు, అసలు ఎవరికి ఆ డబ్బులు ఇచ్చారో వాటి తాలూకు చెక్కు ప్రూఫులు కానీ లేదా ఇస్తున్నప్పుడు తీసిన వీడియోలు కానీ బయట ఎందుకు పెట్టడం లేదని రాకేష్ మాస్టర్ ప్రశ్నించారు. 

 

వాస్తవానికి తనకు హీరోలందరి పై మంచి అభిమానం ఉందని, అయితే ప్రస్తుతం వారు ఇచ్చిన విరాళాలు వారి స్థాయికి తగినవి కాదని, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా వారు ఇచ్చివుండవచ్చునని, అయినా ఇచ్చే సమయంలో ప్రూఫ్ చూస్తేనే ఎవరైనా నమ్మేది, ఇటువంటి ప్రకటనలు మెజారిటీ ప్రజలు నమ్మినప్పటికీ నాలాంటి కొందరు మాత్రం నమ్మరని విమర్శలు చేసారు. అయితే రాకేష్ మాస్టర్ వాదనపై కొంత భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. ఆయన మాట్లాడినదానిలో కూడా వాస్తవం ఉందని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం, అంతపెద్ద హీరోలు విరాళాలు ఇవ్వకుండా ఇచ్చాం అని ఎలా చెప్పుకుంటారు, తప్పనిసరిగా ఇవ్వడానికి సిద్దము అయిన తరువాతనే ప్రకటన చేస్తారు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా మన హీరోలపై రాకేష్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: