మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' తెలుగు రీమేక్ రైట్స్ కొణిదెల ప్రొడక్షన్స్ నుండి రామ్ చరణ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఈ మలయాళ రీమేక్ లో నటించనున్నారని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే సందేహం ప్రేక్షకులలో మొదలైంది. ఐతే తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి దీనిపై స్పష్టత ఇచ్చారు. లూసిఫర్ తెలుగు రీమేక్ కి దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తారట. ఇప్పటికే చిరంజీవి తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని సుజీత్ తో చెప్పారట. సుజీత్ తెలుగు నేటివిటీకి దగ్గరగా లూసిఫర్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారని సమాచారం.

 

గత ఏడాది సుజీత్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'సాహో' మిశ్రమ ఫలితాలను అందుకుంది. తెలుగులో ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ హిందీలో మాత్రం హిట్ అందుకుంది. అయినప్పటికీ చిరంజీవి సుజీత్ టాలెంట్ పై నమ్మకముంచి అతనికే ఈ మూవీ రీమేక్ బాధ్యతలు అప్పగించాడట. సుజీత్ రన్ రాజా రన్ చిత్రంత్తో దర్శకుడిగా పరిచయమై ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఈ క్రేజీ ఆఫర్ దక్కడంతో ఈయన రేంజ్ ఎక్కడికో వెళ్లబోతోందని చెప్పవచ్చు.

 

ఇదిలా ఉండగా 'సైరా నరసింహారెడ్డి' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ఆచార్య'. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని అన్నీ అనుకున్నట్లు జరిగితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కాజల్ అగర్వాల్ రాకతో హీరోయిన్ కష్టాలు తీరిపోయాయి. ఈ మధ్య లీకైన చిరు లుక్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేలా చేసింది. ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా చెప్పకపోయినా ఇదే కంఫర్మ్ అని తెలుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: