ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలు అన్ని కూడా కరోనా వ్యాధి భయంతో ఎంతో వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారిని వేగవంతంగా తరిమి కొట్టాలంటే ఎక్కడి ప్రజలను అక్కడే పూర్తిగా తమ తమ ఇళ్లకు పరిమితం చేయడం ఒక్కటే మార్గం అని భావించిన పలు దేశాలు ఇప్పటికే తమ దేశాలను పూర్తిగా కొన్నాళ్లపాటు లాకౌట్ చేస్తున్నట్లు ప్రకటనలు జారీ చేసాయి. అలానే మన దేశాన్ని కూడా ఈ నెల 14 వరకు లాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక ఈ లాకౌట్ సమయంలో ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకూడదని, ఏదైనా అత్యవసర పని ఉన్నపుడు మాత్రమే బయటకు రావాలని, అలానే విధిగా ప్రతి ఒక్కరూ కూడా మొహానికి మాస్కులు ధరించడంతో పాటు రోజులో వీలైనన్ని ఎక్కువసార్లు తమ చేతులను సబ్బు లేదా, శానిటైజర్ లతో 20 నిమిషాలపాటు శుభ్రం చేసుకోవాలని పలు సూచనలు జారీ చేయడం జరిగింది. 

 

ఇక మరీ ముఖ్యంగా దగ్గేటప్పుడు, తుమ్మేటపుడు చేతులను మోచేతివరకు అడ్డుపెట్టుకోవడంతో పాటు ఆ సమయంలో కర్చీఫ్ లేదా టిష్యు పేపర్ వాడాలని కూడా చెప్పడం జరిగింది. ఇక దీనితో మార్కెట్ లో మాస్కులు, శానిటైజర్ ల కొరత పెరిగిపోయింది. కాగా పరిస్థితిని గమంచిన పలువురు అధికారులు, ప్రముఖులు, ఎక్కడి ప్రజలు అక్కడే స్వయంగా తమ ఇళ్లలోనే మాస్కులు తయారు చేసుకునే పలు విధానాలు వివరిస్తున్నారు. ఇకపోతే నటుడు మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి, గత మూడు రోజుల నుండి తన స్నేహితురాండ్లతో కలిసి మొత్తంగా 700 మాస్కులు మిషన్ పై కుట్టి వాటిని పంచిపెట్టడం జరిగిందనే వార్తతో పాటు ఆమె ఫోటో ఒకటి నిన్నటి నుండి పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండడంతో, పలువురు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 

ఇక ఈ వార్తపై కాసేపటి క్రితం మెగాస్టార్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. నిన్నటి నుండి మీడియాలో ప్రచారం అవుతున్న ఆ వార్తలో వైరల్ అవుతున్న ఫోటో తన తల్లిది కాదని, అలానే ఆ వార్తతో తన తల్లికి ఎటువంటి సంబంధం లేదని, అయితే ఇటువంటి విపత్కర సమయంలో తనవంతుగా సేవచేస్తూ ఆ విధంగా దయాగుణంతో కష్టపడి మాస్కులు కుట్టి, అందరికీ అందచేస్తున్న ఆ మహాతల్లికి నా కృతజ్ఞతలు. మనసున్న ప్రతి తల్లి అమ్మే కదా అంటూ మెగాస్టార్ తన పోస్ట్ లో తెలిపారు.....!!! 

మరింత సమాచారం తెలుసుకోండి: