ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా 'ఆర్.ఆర్.ఆర్' మాటే వినిపిస్తోంది. ఒక సినిమాని జనాల్లోకి ఎలా తీసుకుపోవాలో రాజమౌళికి తెలిసినంతగా మరే దర్శకుడికి తెలియదు అని చెప్పవచ్చు. ఒక్కసారి బయటకి వచ్చి ప్రమోషన్ చేయడం స్టార్ట్ చేసాడంటే అది రిలీజై సూపర్ హిట్ అయ్యే దాకా జనాల మధ్య తిరుగుతూనే ఉంటుంది. ఇటీవలే ఉగాది సందర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగోను, మోస్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ తరవాత రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ ఒక్క వీడియో సినిమా అంచనాలను రెట్టింపు చేసింది. ఈ నేపథ్యంలో యావత్ భారతదేశ సినీ అభిమానులు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా విడుదల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమాని మొదటగా ఈ ఏడాది జూలై చివర్లో విడుదల చేయాల్సింది. కానీ కొన్ని షూటింగ్ పనులు వాయిదా ఉండడంతో వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేయడం జరిగింది.

 

కానీ ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా షూటింగ్ పూర్తిగా నిలిపి వేయడం జరిగింది. మళ్లీ తిరిగి షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగులన్నీ జూన్ నెల దాకా స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవు. మూవీ షూటింగ్స్ డిలే అయితే సినిమా రిలీజ్ డేట్స్ కూడా ఖచ్చితంగా వాయిదా పడతాయని సినీ విశ్లేషకులు అంచనా చేస్తున్నారు. రాజమౌళి ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తామని ప్రకటించినా ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఇది సాధ్యపడేలా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు లేటెస్టుగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాటేంటంటే ఒకవేళ ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి బరి నుండి తప్పుకుంటే ఆ ప్లేస్ లోకి మెగాస్టర్ నటిస్తున్న 'ఆచార్య' వస్తుందంట. వివరాల్లోకి వెళ్తే మెగాస్టర్ చిరంజీవి కెరీర్లో 152వ మూవీగా తెరకెక్కుతున్న 'ఆచార్య'లో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించనున్నాడు. అయితే చరణ్ 'ఆర్.ఆర్.ఆర్'కి కమిట్మెంట్స్ ఇచ్చి ఉండటం వల్ల ఆ సినిమా షూటింగుకి డేట్స్ ఇవ్వలేదు. అందులోనూ 'ఆచార్య' కంటే ముందే తన సినిమా ముందు రావాలని భావించిన జక్కన్న.. 'ఆచార్య' సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేసుకోమని రామ్ చరణ్ కి సలహా ఇచ్చాడట.

 

అయితే ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల అన్ని తలక్రిందులయ్యాయి. అన్ని సినిమాలు షూటింగులు ఇంకొన్ని రోజులు వాయిదా వేసుకుంటూ పోతే సినిమాలన్నీ ముందుకు జరుగుతూ వెళ్లే అవకాశం ఉంది. అందులోను భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి విడుదల ఛాన్సెస్ తక్కువే అని చెప్పాలి. అలంటి నేపథ్యంలో వచ్చే ఏడాది సమ్మర్ కి కానీ ఈ సినిమా రిలీజ్ చేయలేరు. దీంతో రామ్ చరణ్ కోసం వెయిట్ చేస్తూ 'ఆచార్య' సినిమా ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది. రామ్ చరణ్ కి 'ఆచార్య' సినిమాను అంత డిలే చేసే ఉద్దేశ్యం లేదంట. ఎలాగైనా రాజమౌళిని కన్విన్స్ చేసి త్వరగా 'ఆచార్య' కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను సిద్ధం చేయాలని భావిస్తున్నాడట. ఇదే గనుక జరిగితే 2021 సంక్రాంతికి 'ఆర్.ఆర్.ఆర్' స్థానంలో 'ఆచార్య' సినిమా విడుదల అవుతుందని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: