టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఈ ఇద్దరూ ప్రస్తుతం టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అనంతరం నెంబర్ వన్ స్థానానికి అతి దగ్గరగా ఉన్న హీరోలు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిలో మహేష్ కంటే, పవన్ ఒకింత సీనియర్ అని చెప్పాలి. ముందుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో మెగాస్టార్ తమ్ముడిగా టాలీవుడ్ అరంగేట్రం చేసిన పవన్, ఫస్ట్ మూవీ తో మంచి విజయాన్ని, పేరుని దక్కించుకున్నారు. ఇక అక్కడి నుండి చాలావరకు విజయాలు అందుకుంటూ ముందుకు సాగిన పవన్, ఇటీవల వచ్చిన అజ్ఞాతవాసి సినిమా వరకు టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించారు. 

 

ఇక తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్, ఫస్ట్ మూవీ తోనే అతి పెద్ద విజయాన్ని అందుకున్నారు. అయితే రెండవ సినిమాతో కూడా మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు, ఆపై వచ్చిన నాలుగవ సినిమా మురారితో సిల్వర్ జూబ్లీని అందుకున్నారు. ఇక మొన్నటి సరిలేరు నీకెవ్వరు వరకు కూడా ప్రతి ఒక్క సినిమాతో తన క్రేజ్ ని అమాంతం పెంచుకుంటూ పోతున్న సూపర్ స్టార్ మహేష్ కు టాలీవుడ్ హీరోల్లో విపరీతమైన క్రేజ్ ఉండడంతో పాటు ఎందరో అభిమానులను ఆయన సంపాదించడం జరిగింది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా వకీల్ సాబ్ తో పాటు ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న క్రిష్ జాగర్ల ముడి సినిమాలకు గాను పవన్ రూ.55 కోట్లవరకు ఒక్కో సినిమాకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్. 

 

అలానే అతి త్వరలో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో పాటు ఆపై రూపొందనున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా కోసం మహేష్ కూడా రూ.55 కోట్లు ఒక్కో సినిమాకు అందుకోనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అంటే వీరిద్దరూ ఒకే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలానే ఈ ఇద్దరు హీరోలు కూడా ఈ రెమ్యునరేషన్ ని పూర్తిగా కాకుండా కొంతమేర తమకు నచ్చిన ఏరియా హక్కుల లాభాల్లో, కొంత వాటాలు రూపేణా తీసుకుంటారట. ఇక వీరిద్దరి కంటే కూడా పాన్ ఇండియా మూవీలైన బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాల తరువాత రూ.75 కోట్లకు పైగా రెమ్యునరేష్ అందుకున్న ఏకైక తెలుగు స్టార్ గా ప్రభాస్ నిలిచినప్పటికీ, ఆయనను వీరితో కంపేర్ చేయలేమని అంటున్నారు సినీ విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: