కరోనా వైరస్ కనబడని శత్రువు ఎంత పని చేసిందని అంతా ఏడుస్తున్నారు. ఇదే జీవితం అనుకుని ఇలాగే ఎప్పటి నుంచో బతకడం అలావాటు చేసుకున్న వారందరికీ ఇపుడు కరోనా అతి పెద్ద బాస్ అయింది. ఓ విధంగా చండశాసనుడు అబ్బా మొగుడైంది. జీవితం అంటే ఏంటో అందరికీ చూపిస్తోంది. కరోనా ముందు కరోనా తరువాత అన్నట్లుగా భారీ విభజన జరిగిపోతోంది.

 

ఏ రంగం సంగతి ఎలా ఉన్నా వీరంగం వేసుకుని సినిమాల్లో   హీరోలుగా చెలరేగిపోతున్న చాలా మందికి కరోన ఎఫెక్ట్ తగిలేలా ఉంది. ముఖ్యంగా అరవయిలో ఇరవై వేషాలు వేసే వారికి, కొంతమంది సీనియర్ హీరోలకు కరోనా దెబ్బ మమూలుగా ఉండదుట.

 

వారు తమకు తాముగానే ఇంటికి వెళ్ళిపోతే చాలా బెటర్ అంటున్నారు. లేకపోతే కరోనా వారికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చేలా ఉందిట. ఎందుకంటే ఇప్పటికే టాలీవుడ్ దెబ్బ తిని ఉంది. నూటికి పది శాతం  హిట్లు కరవు అయిపోతున్నాయి. అయినా సరే కాలం బాగుంది కాబట్టి రోజులు సాగిపోయాయి.

 

ఇపుడు అలా జరిగేది కాదని అంటున్నారు. కచ్చితంగా ప్రతీదీ హిట్ పడాల్సిందే. పెట్టిన ప్రతీ పైసాకు లాభం రావాల్సిందే. ఒక విధంగా మొహమాటాలు లేవు, అభిమానాలూ ఉండవు, పక్కా బిజినెస్ అంతే. ఇష్టం వచ్చినట్లు సెంటిమెంట్లు పెట్టుకుని కాంబోలతో దిగిపోతే ఆ సినిమాలు బోల్తా కొడితే ఇక నెత్తిన కొంగు వేసుకోవడం ఉండదు. 

 

మొత్తానికి మొత్తం తుడిచిపెట్టుకోవడమే.దీంతో ఇక నాణ్యతతో కూడిన సినిమాలు వస్తాయి. అలాగే సీనియర్లు, కలెక్షన్లు రాబట్టలేని వారికి ఇక అవకాశాలు తగ్గిపోతాయని అంటున్నారు. మరో వైపు సినిమాల నిర్మాణం కూడా బాగా తగ్గుతుందని అంటున్నారు.

 

ఇప్పటికైతే వందకు తక్కువ కాకుండా సినిమాలు తీసే టాలీవుడ్లో ఆ సంఖ్య సగానికి సగం పడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సినిమా థియేటర్లు కనీసం వేయికి పైగా ఏపీలో లేచిపోవడమూ ఖాయమే.  మిగిలేవి ఐమాక్సులు, కొన్ని పెద్ద సినిమా హాళ్ళే. అవి కూడా టికెట్టు  రేటు తగ్గించి జనాలను అట్రాక్ట్ చేసుకోకపోతే మాత్రం బొమ్మ తిరగబడుతుందంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: