సూపర్ స్టార్ మహేష్ బాబుకి రికార్డులను సృష్టించడం కొత్త కాదు. కానీ సినిమా వచ్చి ఐదేళ్లైనా ఆ సినిమా ఏదొక విధంగా రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉంది. వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు, అందాల భామ శ్రుతి హాసన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొర‌టాల శివ దర్శకత్వంలో తెర‌కెక్కించిన‌ యాక్షన్ ఎంటర్టైనర్ 'శ్రీమంతుడు'. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించిన ఈ చిత్రం సూపర్ స్టార్ స్టామినాని మరోసారి సినీ ఇండస్ట్రీలకు గుర్తు చేసింది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా స‌రికొత్త రికార్డుని త‌న ఖాతాలో వేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో 99,366,509 మంది వీక్షించ‌గా, ఇంత‌ వ్యూస్‌ని సంపాదించిన మొద‌టి తెలుగు సినిమాగా 'శ్రీమంతుడు' నిలిచింది . త్వరలో 100 మిలియన్ల క్లబ్ లో చేరనుంది మహేష్ 'శ్రీమంతుడు'.

 

గ్రామాలను దత్తత తీసుకోవడం అనే సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందిన‌ 'శ్రీమంతుడు' చిత్రం తన తండ్రి నుండి వ్యాపార సామ్రాజ్యాన్ని వారసత్వంగా పొందిన యువకుడి కథ నేప‌థ్యంలో రూపొందింది. దేవరకోట అనే మారుమూల గ్రామంలో తన తండ్రి పూర్వీకుల మూలాల గురించి తెలుసుకున్నప్పుడు, హర్ష వర్ధన్ గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తాడు. 2015 లో విడుదలైన 'శ్రీమంతుడు' ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.0 బిలియన్లు వసూళ్ళు చేసింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.  

 

 

ఇదిలా ఉండగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి కానుకగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించిన బ్లాక్ బస్టర్ కా బాప్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు తన కెరీర్లో 27వ సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని అభిమానులు భావించినప్పటికీ ప్రస్తుత సమాచారం ప్రకారం పరశురాం డైరెక్షన్లో మహేష్ తన తదుపరి చిత్రం చేయనున్నట్లు వినికిడి. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు వెలువడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: