మెగాస్టార్ చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ బాబు ఆ సినిమా ఫ్లాప్ అందుకున్నా ఆ తర్వాత గోకులంలో సీత సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. అయితే మూడవ సినిమాగా వచ్చిన సుస్వాగతం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ బాబు, అయితే కళ్యాణ్ బాబు కాస్త పవన్ కళ్యాణ్ గా మారాడు. ఆ తర్వాత యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలతో  బీభత్సమైన క్రేజ్ తెచ్చుకోగా యూత్ ఫ్యాన్స్ అందరు కలిసి ఆయన్ను పవర్ స్టార్ ను చేశారు. 

 

అప్పటివరకు సినిమా హీరో అంటే ఇలానే ఉండాలన్న పరిమితులు ఉండేవి. కానీ పవన్ కళ్యాణ్ ఆ పంథా మార్చేశాడు. యువత మెచ్చే ప్రేమకథలతో తన సినిమాలు చేస్తూ వరుస హిట్లు కొట్టాడు. తన స్టైల్, స్టోరీ సెలక్షన్ ఇవన్నీ యువతకు బాగా నచ్చాయి. అందుకే అతి తక్కువ టైం లో పవన్ కళ్యాణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి కమర్షియల్ హిట్ మూవీ తొలిప్రేమ. కరుణాకరన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా పవన్ రేంజ్ పెంచింది. ఇక ఆ వెంటనే వచ్చిన తమ్ముడు సినిమా సెన్సేషనల్ హిట్ కాగా..  తర్వాత వచ్చిన బద్రి, ఖుషి సినిమాలు పవన్ ను తిరుగులేని స్థాయిలో నిలబెట్టాయి. 

 

అందరి హీరోలు రొటీన్ ఫార్ములా సినిమాలు చేస్తున్న రోజుల్లో యూత్ ఆడియెన్స్ ను మెప్పించే సినిమాలు చేస్తూ సూపర్ డూపర్ హిట్లు కొట్టాడు పవన్ కళ్యాణ్. అందుకే అప్పటికి ఇప్పటికి యూత్ లో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంటుంది. 24 ఏళ్ల కెరియర్.. 25 సినిమాల ప్రస్తానం.. దేవుడిలా భావించే అభిమానులు.. ఫ్లాప్ అయినా కోట్లు తెచ్చే క్రేజ్ ఇవన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సొంతం. పొలిటికల్ ఎంట్రీతో కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన పవన్ మళ్ళీ వకీల్ సాబ్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.               

మరింత సమాచారం తెలుసుకోండి: