ప్రస్తుతం ప్రపంచ దేశాలు అన్నిటినీ కూడా అల్లల్లాడిస్తున్న మహమ్మారి కరోనా దెబ్బకు ఎక్కడి ప్రజలు అక్కడే తమ ఇళ్లలో ఉండిపోవాలంటూ ఇప్పటికే పలు దేశాలు లాక్ డౌన్ ని ప్రకటించగా, ఇప్పటికే మన దేశంలో కూడా ప్రకటించిన లాక్ డౌన్ ని మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ఇటీవల ప్రకటన చేసారు ప్రధాని నరేంద్ర మోడీ. కాగా ప్రజల మధ్య సామజిక దూరం పెంచడం వల్లనే వేగంగా ఈ మహమ్మారిని తరిమి కొట్టవచ్చని భావించి చాలా దేశాలు లాక్ డౌన్ ని అమలు చేస్తున్నాయి. దీనితో పలు రంగాలు అన్ని కూడా మూతపడ్డాయి. అలానే సినిమా షూటింగ్స్ కూడా రద్దు కావడంతో ఎక్కడి సినిమాల షూటింగ్స్ అక్కడే ఆగిపోయాయి. 

 

దానితో సినిమా రంగానికి కూడా బాగానే నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. మన టాలీవుడ్ లో అయితే ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమా మొదలుకుని చిన్న సినిమాల వరకు ప్రతి సినిమా కూడా ఎంతో కొంత నష్టాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి ఎదురైంది. అయితే ఈ కరోనా ఎఫెక్ట్ ఒకరకంగా మన టాలీవుడ్ లోని కొందరు హీరోల కళ్ళు తెరిపించినట్లు చెప్తున్నారు. మొత్తంగా లాకౌట్ ముగిసే మే 3వరకు చూసుకుంటే దాదాపుగా నెలన్నరకు పైగా షూటింగ్స్ ఆగిపోయినట్లే అని, అలానే ఆపై ఎప్పడినుండి పునరుద్దరించబడతాయో కూడా చెప్పలేని పరిస్థితి ఉందని సమాచారం. 

 

కాగా ఎప్పుడైతే షూటింగ్స్ కి పర్మిషన్ వస్తుందో, అప్పటి నుండి తమ సినిమాల షూటింగ్స్ ని ఏ మాత్రం కొద్ది విరామం కూడా లేకుండా నిరంతరం కొనసాగించి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారట కొందరు హీరోలు. అయితే కేవలం వారు మాత్రమే కాదు, దాదాపుగా చాలామంది సినిమా వారు ప్రస్తుతం అదేరకమైన ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఒకరంగా దానివలన ఈ మధ్య కాలంలో వచ్చిన నష్టాన్ని పూర్తిగా పూడ్చలేకపోయినా, కొంతవరకు అయినా దానిని రికవర్ చేయవచ్చని వారు భావిస్తున్నారట. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే ఇది ఒకరకంగా మన టాలీవుడ్ కి మంచి చేస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: