యాక్షన్ సినిమాలైనా, కామెడీ సినిమాలైనా, రెండింటినీ మిళితం చేసి యాక్షన్ కామెడీ తీయడంలోనైనా వివి వినాయక్ స్టైలే వేరు. ఆయన దర్శకత్వం వహించిన దిల్, ఆది, ఠాగూర్ చిత్రాలు ఎంతటి బ్లాక్ బస్టర్ సాధించాయో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోలందరితో పనిచేసిన వినాయక్ ప్రస్తుతం దర్శకత్వన్ని పక్కన పెట్టి హీరోగా సినిమా చేస్తున్నాడు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న వినాయక్, ఔట్ డేటెడ్ కథలతో ప్లాపులు తీశాడు.

 

దాంతో ఆయనకి దర్శకుడిగా ఛాన్సులు తగ్గిపోయాయి. మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నంబర్ ౧౫౦ సినిమా తీసి విజయం సాధించినప్పటికీ, అది మెగాస్టార్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. దాంతో వివి వినాయక్ పరిస్థితి మళ్లి మొదటికే వచ్చింది. అయితే దర్శకత్వాన్ని పక్కన పెట్టి నటుడిగా తనని తాను పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. గతంలో తాను స్వీయ దర్శకత్వం వహించిన సినిమాల్లో చిన్నా చితకా పాత్రలో వినాయక్ కనిపించాడు.

 

ఇప్పుడు మొదటి సారిగా పూర్తి స్థాయి పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో శరభ చిత్ర దర్శకుడు నరసింహం దర్శకత్వంలో సీనయ్య అనే సినిమాని స్టార్ట్ చేశాడు. దిల్ సినిమాతో ఎప్పటికీ మరిచిపోలేని విజయాన్నందించిన దిల్ రాజు, తన నిర్మాణంలోనే వినాయక్ ని హీరోగాపరిచయం చేయాలని భావించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి రెండు షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేసుకుంది.

 


అయితే ఔట్ పుట్ చూసుకుంటే సరిగ్గా రాలేదట. దాంతో దిల్ రాజు ఈ సినిమాని పక్కన పెట్టేసాడని అంటున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల నిర్మాతలకి తీవ్ర నష్టం వాటిల్లింది. అందువల్ల వినాయక్ తో చేసే సీనయ్య సినిమాని ఆపేద్దామని అనుకుంటున్నాడని సమాచారం. లాక్డౌన్ పూర్తయితే గానీ ఈ విషయంలో ఎలాంటి స్పష్టత రాదు. ఒకవేళ దిల్ రాజు వినాయక్ తో సినిమా వద్దనుకుంటే, నటుడిగానైనా నిరూపించుకుందామని అనుకున్న వినాయక్ ఆశలకి ఆదిలోనే అడ్డుపడ్డట్టే..!

మరింత సమాచారం తెలుసుకోండి: