జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా ప్రజలకి జీవితం మీద ఆశ, వెయ్యోనుగుల బలం వస్తాయి. ప్రజల పట్ల ఆయనకున్న బాధ్యతతో, ఏదైనా సంఘటన జరిగితే క్షణాల్లో స్పందించే విధానం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. జనసేన పార్టీ పెట్టినప్పటినుంచి పవన్ కళ్యాణ్ ప్రజలకోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్న విషయం అందరం ప్రత్యక్షంగా చూస్తున్నదే. ఇక ఈ రోజు ఏప్రిల్ 16 న కందుకూరి వీరేశలింగం పంతులు గారి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయన ఆశయాలను, సమాజంలో వీరేశలింగం గారు చేసినా ఎన్నో మర్చిపోలేని సంఘటనలను, బాలికలు, స్త్రీలకోసం చేసిన పోరాటాలను గుర్తుచేశారు. 

 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ .. కందుకూరి వీరేశలింగం గారు తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు.. స్త్రీలకి విద్య తప్పనిసరి అంటూ.. ఈ విషయం పట్టు వదలకుండా ఉద్యమం చేశారని, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించారని తెలిపారు. మగపిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం దగ్గర్నుంచి అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా అందరి పిల్లలతో కలిసి కూర్చోబెట్టి తారతమ్యం అనే అడ్డుగీతని లేకుండా చేశారు. వీళ్ళందరికి ఉచితంగా చదువు చెప్పడమే కాకుండా పుస్తకాలు పంపిణీ చేశారు. 

 

అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి, వితంతువులై ఎన్నో కష్టాలు పడేవారు. సమాజంలో ఇది శాశ్వతంగా లేకుండా చేయడానికి వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయడంతో పాటు  ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికి అన్నిటిని ఓర్చుకొని ఆయన అనుకున్నది సాధించి ఆచరణలో పెట్టారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అంతేకాదు స్త్రీ అభ్యూదయానికై ఎన్నో చేశారు. ఇక తెలుగులో మొట్ట మొదటి నవల రచయిత కూడా కందుకూరి వీరేశలింగం గారు కావడం విశేషం. ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంగారికి అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. 

 

ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు అంటూ తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంలోనే మనమందరం కందుకూరి వీరేశలింగం గారి ఆశలను, ఆశయాలను, నైతిక విలువలను వారి ఆస్థులుగా భావించి వాటిని ఆచరణలో పెట్టడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని ..తెలుగు భాషోన్నతికి దోహదపడినటువంటి స్పూర్తిదాయక కార్యక్రమాలను మనం ఎప్పటి మరవరాదని పవన్ కళ్యాణ్ తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలు తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే హైకోర్టు మాత్రం తెలుగు భాషా వివాదం పై సానుకూలంగా స్పందించి తీర్పునిచ్చింది. 

 

ఈ విషయంలో కందుకూరి వీరేశలింగం గారిని స్పూర్తిగా తీసుకొని తెలుగు భాషని కాపాడుకునేందుకు ముందడుగు వేయాలని తెలిపారు.  ఇక కందుకూరి వీరేశలింగం గారి పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ..వారిని ఆదర్శంగా తీసుకొని ఆయన సంచరించిన ప్రాంతం అయిన గోదావరి నది ఒడ్డున " మన నుడి మన నది " అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆయన ఇచ్చిన స్పూర్తితో సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.

 

      

మరింత సమాచారం తెలుసుకోండి: