టాలీవుడ్‌లో ఎంత మంది న‌టీన‌టులున్నా.. కొంత‌మందికి మాత్రం ప్ర‌త్యేక‌మైన గుర్తింపు  ఉంటుంది. అలాంటి వారిలో అల‌నాటి న‌టీన‌టులు ఎంతోమంది ఉన్నారు.  సీనియ‌ర్ న‌టులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి లాంటి మహానటులు ఎంద‌రో ఉన్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో సావిత్రి నటన అద్వితీయంగా ఉండేది  అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఆమె ముఖంలో హావభావాలు పలికించడంలో ఆమెకు ఆమే సాటి అని చెప్పాలి. అందుకే అప్పట్లో సావిత్రి లేని సినిమా ఉంటుందా అని అనుకునే వారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో పోటీగా ఆమెకు ఛాన్సులు విప‌రీతంగా వ‌చ్చేవి. ఇక సావిత్రి మ‌ర‌ణానంత‌రం మ‌ళ్ళీ అంత‌టి న‌ట‌న ఎవ్వ‌రూ క‌న‌బ‌ర్చ‌లేరు అనుకున్న స‌మ‌యంలో బెంగుళూరు నుంచి వచ్చిన నటి సౌందర్య ఆ లోటు భర్తీ చేసిందనే చెప్పాలి. 1972 జూలై 18 న అష్టగ్రామంలో జన్మించింది. తెలుగు, తమిళం, కన్నడం మరియు మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది ఈ భామ‌. ఈమె 2004 ఏప్రిల్ 17న హెలీకాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌రణించింది. ఈ రోజుతో ఆమె చ‌నిపోయి ప‌ద‌హారేళ్లు పుర్త‌యిన సంద‌ర్భంగా హెరాల్డ్ సౌంద‌ర్య స్పెష‌ల్ ఆర్టిక‌ల్‌...

 

ఈమె తన మేనమామ మరియు తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయిన జి.ఎస్.రఘును 27 ఏప్రిల్ 2003లో వివాహం చేసుకుంది. సౌందర్య అసలు పేరు సౌమ్య. ఇక సినీ రంగ ప్రవేశం కొరకు ఆమె పేరును సౌందర్యగా మార్చుకున్నది. సౌందర్య ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా ఆమె తండ్రి స్నేహితుడు, గంధర్వ (1992) చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. తరువాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. కోడీ రామకృష్ణ తెరకెక్కించిన అమ్మోరు చిత్రంతో తిరుగులేని విజయం సాధించి తెలుగు అమ్మాయిగా ఇక్కడే స్థిరపడిపోయింది. దీంతో చదువు మద్యలోనే ఆపేసిన సౌందర్య తర్వాత అగ్ర హీరోల సరసన నటిస్తూ వరుస విజయాల‌ను  దక్కించుకుంది.

 

ఇక నటిగా మంచి ఫామ్ లో ఉండగా కన్నడ, తమిళం, మళయాళం మరియు ఒక హిందీ చిత్రంలో నటించింది. ఈమెకు ప‌ర‌భాష‌ల్లో కూడా అవ‌కాశాలు బాగానే వ‌చ్చేవి. హిందీలో ఆమె అమితాబచ్చన్ తో కలిసి సూర్యవంశ్ అనే చిత్రంలో నటించింది. సౌందర్య కన్నడంలో నటించిన ఆఖరి చిత్రం "ఆప్త మిత్ర" విజయవంతమైంది.  ఆమె జ్ఞాపకార్ధం "సౌందర్య స్మారక పురస్కారం"ను కర్ణాటకాంధ్ర లలితకళ అకాడమి వారు ప్రతీ సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు ప్రధానం చేస్తున్నారు. సౌందర్య ఒక్క నటిగానే కాకుండా సామాజిక వేత్తగా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేదట. సౌందర్య 'అమర సౌందర్య సోషియల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్' (ASSET) ద్వారా తన భర్త , ఆడపడుచు సహకారంతో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: