కరోనా విలయతాండవంతో ప్రపంచం మొత్తం కుదేలైపోతోంది. అత్యంత సంపన్న దేశాలు సైతం చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ అనేక మంది సెలబ్రిటీలు స్వచ్ఛందంగా తమ బాధ్యత నెరవేరుస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు అనేక రూపాల్లో చారిటీలు చేస్తున్నారు. వివిధ పద్ధతుల్లో పోలీసులకు, పారిశుద్ధ్య సిబ్బందికి, కార్మికులకు సాయం అందిస్తున్నారు. ఇటువంటి చారిటీనే ఇప్పుడు వైద్యుల కోసం అంతర్జాతీయస్థాయిలో జరుగబోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యుల పాత్ర అత్యంత కీలకంగా మారిన విషయం తెలిసిందే.

 

 

కరోనాపై ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతగా, బాధితుల కోసం విరాళాల సేకరణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, గ్లోబల్‌ సిటిజెన్‌ సంయుక్తంగా ప్రముఖనటులతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచ నలుమూలల నుంచి 70 మందికిపైగా పాల్గొనే ఈ లేట్‌నైట్‌ ఈవెంట్‌లో బాలీవుడ్‌ నటులు షారుక్‌ఖాన్‌, ప్రియాంకచోప్రా పాలుపంచుకోనున్నారు. వీరంతా ఇంట్లో ఉంటూనే దీనిలో పాల్గొంటారు. ఈ ఈవెంట్‌ భారత్‌లో ఆదివారం రాత్రి 8 నుంచి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, అలీబాబా, అమేజాన్‌ ప్రైమ్‌ వీడియో, యాపిల్‌ తదితర ప్లాట్‌ఫాంలపై ప్రసారం కానుంది. వైద్యలు సేవలను కొనియాడుతూ ఇప్పటివరకూ అందరూ అండగా నిలవడం జరిగింది. 

 

 

ఇప్పుడు ప్రపంచమంతా వైద్యుల కోసం ఏకమవుతోంది. కరోనా ప్రభావానికి ప్రపంచమంతా ఒక్కటవుతుందనడానికి ఇటువంటి చారిటీలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. సామాన్యులు కూడా తమకు ఉన్నదాంట్లోనే సాయం అందిస్తున్నారు. దీని వల్ల ఎంతోమంది వలస కూలీలకు, ఉపాధి కోల్పోయిన వారికి ఆహారం, నిత్యావసరాలు అందుతున్నాయి. అన్ని భాషల సినీ పరిశ్రమల్లో కూడా అక్కడి కార్మికుల కోసం సినీ సెలబ్రిటీలు విరాళాలు ప్రకటిస్తూ ఈ సమయంలో ఆదుకుంటున్నారు. మన తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి ఆధ్వర్యంలో సీసీసీ ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: