ఏప్రిల్ 18వ తేదీన విజయదశమి సందర్భంగా 1985వ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎమోషనల్ యాక్షన్ ఫిలిం 'చిరంజీవి' విడుదలయ్యి నేటికి 35 సంవత్సరాలు పూర్తయింది. ఈ చిత్రంలో విజయశాంతి కథానాయికిగా నటించగా... భానుప్రియ ఓ చిన్న పాత్ర పోషించింది. 'చిరంజీవి' చిత్రం 1984 లో రిలీజ్ అయిన కన్నడ చిత్రం నానే రాజా యొక్క రీమేక్. అజయ్ క్రియేషన్స్ బ్యానర్ కింద లక్ష్మీనారాయణ నిర్మాణంలో రాజేంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకి కే. చక్రవర్తి సంగీత బాణీలు అందించారు. 

 


ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, నూతన ప్రసాద్, సుత్తివేలు, అన్నపూర్ణమ్మ, మురళీమోహన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో సత్యనారాయణ పోలీస్ ఆఫీసర్ గా... హీరో చిరంజీవి కి తండ్రి గా నటించారు. చిరంజీవి తల్లి అన్నపూర్ణమ్మ చిన్నతనంలోనే చనిపోవడంతో తానే తల్లి తండ్రి అయ్యి అతనిని పెద్ద చేస్తాడు. ఎప్పుడూ చాలా సంతోషంగా అందరితో కలిసిమెలిసి ఉండే చిరంజీవి తన తండ్రిని ఎవరైనా ఏదైనా అంటే బాగా కోప్పడతాడు. అయితే ఈ క్రమంలోనే చిరంజీవికీ పరిచయమైన విజయశాంతి సత్యనారాయణ గురించి తప్పుగా మాట్లాడుతుంది. దాంతో ఆగ్రహానికి గురైన చిరంజీవి ఆమెను బలంగా తోసివేయగా ఆమె తల గోడకు గుద్దుకుంటుంది. దాంతో విజయశాంతి అక్కడికక్కడే మృతి చెందుతుంది. పొరపాటున తన ఆగ్రహానికి బలై పోయిన విజయశాంతి మరణం గురించి తన తండ్రికి తెలియకుండా దాచిపెట్టేందుకు చిరంజీవి అనేక ప్రయత్నాలు చేస్తాడు. 

 

 


ఈ సినిమాలో విజయశాంతి చెల్లెలుగా భానుప్రియ నటించింది. తాను ఒక గుడ్డి యువతిగా నటించగా.. ఆమెకు ప్రియుడిగా మురళీమోహన్ నటించాడు. ఈ సినిమా చివర్లో చిరంజీవి తన తండ్రి సత్యనారాయణ చేతిలో చంపబడతాడు. ఏదేమైనా సినిమా మొత్తంలో సత్యనారాయణ ఇంట్లో పని మనుషులుగా ఉన్నా సుత్తివేలు-చిరంజీవి మధ్య హాస్యాస్పదమైన సన్నివేశాలు చాలా బాగా పండాయి. సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొంద లేకపోయినా అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చూడదగినవేనని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: