బొమ్మ అంటేనే ఒక ఊహ. కొందరికి ఊహకు ప్రాణం కూడా. అందానికి అదే గుర్తు. అద్భుతానికీ అదే హద్దు. అనకారితనానికీ అదే ఒక చేదు గురుతు. మొత్తానికి చెప్పుకుంటే మంచికైనా చెడ్డకైనా కూడా బొమ్మనే చెప్పుకోవాలి.

 

దేవుడు కూడా ఒక బొమ్మగానే కనిపిస్తాడు. ఉలకడు పలకడు. తాను చేసిన‌ బొమ్మను ఆడిస్తాడు, పాడిస్తాడు. ఏడిపిస్తాడు. ఇపుడు అదే జరుగుతోంది.  తెర మీద బొమ్మలతో బంధం  వేసుకున్న వారు హీరోలూ,  బంజారా హిల్స్ లో కార్లతో బంగాళాలతో తిరిగే భాగ్యవంతులే కానక్కరలేదు.

 

జీతానికీ, జీవితానికి మధ్యన పొంతల లేక ప్రతీ నిత్యం సమరం సాగించే వారూ ఉంటారు. అటువంటి వారిలో సినీ కార్మికులు ఉన్నారు. వారిని ఆదుకుంటున్నారు సినీ హీరోలు. కానీ వారికంటే కూడా దారుణంగా బతుకులు ఈడుస్తున్న సినిమా హాళ్ళలో పనిచేసే కార్మికుల గురించి ఎవరు పట్టించుకుటున్నారు.

 

వారివి ప్రైవేట్ బతుకులు. బొమ్మ బాగా ఆడితేనే వారికీ సంతోషం. ప్రతీ సినిమా హాలు వద్ద కనీసం పాతిన నుంచి ముప్పయి మంది వరకూ ఉద్యోగులు పనిచేస్తూంటారు. బుకింగ్ క్లర్కులుగా. గేట్ మ్యాన్లుగా, స్వీపర్లుగా వారి సేవలు ఎన్నో ఉంటాయి.

 

ఇపుడు లాక్ డౌన్ వల్ల బొమ్మ ఆడడం లేదు. దాంతో వారికి కూడా ఇబ్బందులు మొదలయ్యాయి.లాక్ డౌన్ ఎత్తివేసినా సినిమా హాళ్ళు ఇప్పట్లో తెరిచే అవకాశం లేదు. దాని మీద అందరికీ పక్కా క్లారిటీ ఉంది. ఒకవేళ సినిమా హళ్ళు తెరచినా కూడా వాటికి జనం గతంలోలా వస్తారన్న గ్యారంటీ లేదు.

 

దాంతో సగానికి సగం సినిమా హాళ్ళు లేచిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇక అక్కడ పనిచేసే వారిని తీసేసి వేరే ఉద్యోగాలు చూసుకోమంటున్నారు. దాంతో బొమ్మ తిరగబడి వీరంతా రోడ్డున పడ్డారు. మరి వీరికి సినిమా హాళ్ళలోనే పనిచేయడం వచ్చు. ఇక సగం పైగా జీవితాలను చూసిన వీరికి బతుకేది, ఆదుకునే దిక్కేది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: