దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ లో భారీ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్ చరణ్ 'అల్లూరి సీతారామ రాజు' రోల్ పోసిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ నటీనటులతో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

 

ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలుపుదల చేసుకుంది. ఇప్పటికే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' అనే పేరుతో ఎన్టీఆర్ ఒక స్పెషల్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ బర్త్ డేకి రాబోతున్న 'కొమరం భీమ్' వీడియోలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడో అంటూ అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. దీనికి తోడు 'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్ ఇంట్రో వీడియోని రాజమౌళి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడని ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులను నిరాశకు గురి చేసే వార్త ఒకటి బయపెట్టాడట రాజమౌళి. 

 

చరణ్ 'రామరాజు' ఇంట్రో వీడియో కోసం తమ వద్ద చిత్రీకరించిన సన్నివేశాలు ఉండగా.. ప్రస్తుతం ఎన్టీఆర్ ఇంట్రో వీడియో కోసం కావలసిన మెటీరియల్ లేదని ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడట. లాక్ డౌన్ కారణంగా బయటికి వెళ్లే పరిస్థితి లేక ఏమి చిత్రీకరించాలో.. ఇంట్రో వీడియోలో ఏమీ చూపించాలో అర్థం కావడం లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు జక్కన్న. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ జరిగిందని చిత్ర యూనిట్ అధికారికంగా చెప్తుండగా ఎన్టీఆర్ ఇంట్రో వీడియో కోసం మెటీరియల్ లేదనడం అనేక అనుమానాలకు దారి తీస్తుందని కామెంట్ చేస్తున్నారు. మరి ఇది సాకుగా పెట్టుకొని రాజమౌళి ఎన్టీఆర్ బర్త్ డే కి అసలు 'కొమరం భీమ్' స్పెషల్ వీడియో లేకుండా చేస్తాడా.. లేదా ఉన్న మెటీరియల్ తో సాదా సీదాగా ఆ వీడియోని విడుదల చేస్తాడా అనే అనుమానం కలుగుతోంది. ఏది ఏమైనా మే 20న ఆర్.ఆర్.ఆర్ నుండి ఎన్టీఆర్ స్పెషల్ వీడియో కోసం ఫ్యాన్స్ ఆశలు పెట్టుకొని ఉండగా రాజమౌళి తాజా వ్యాఖ్యలు నిరాశ కలిగించాయట. 

మరింత సమాచారం తెలుసుకోండి: