బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. రౌద్రం, రణం, రుధిరం అంటూ వస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాపై అంచనాలు బాగా ఉన్నాయి. నిజజీవిత పాత్రలతో కల్పిత కథని మిళితం చేసి తెర మీద ఆవిష్కరించబోతున్నాడు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ నుండి రాజమౌళి రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేశాడు. 

 

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో చిన్నపాటి వీడియోని రిలీజ్ చేశాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోతో అభిమానులు ఊహించిన దానికన్నా ఎక్కువే ఇచ్చాడు రాజమౌళి. ఈ వీడియోని అల్లూరి సీతారామరాజుగా చేస్తున్న రామ్ చరణ్ కి కొమరం భీమ్ గా చేస్తున్న ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ గా అభివర్ణించాడు.

 


రామ్ చరణ్ పుట్టినరోజున ఎన్టీఆర్ తో గిఫ్ట్ ఇప్పించినట్లుగానే ఎన్టీఆర్ పుట్టినరోజు రామ్ చరణ్ తో గిఫ్ట్ ఇప్పించి కొమరం భీమ్ లుక్ ని రివీల్ చేస్తాడని అనుకున్నారు. అల్లూరి సీతారామరాజు లుక్ కన్నా కొమరం భీమ్ లుక్ ఇంకా బాగుంటుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. కానీ ఆ ఎదురుచూపులకి ఫలితం దక్కేలా లేదు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ పుట్టినరోజున లుక్ రివీల్ చేయడం లేదని చెబుతున్నారు. 

 

ఇప్పటి వరకు చేసిన షూటింగ్ లో ఎన్టీఆర్ పై ఇంట్రడక్షన్ షాట్లు తీయలేదట. డెభ్బై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నా ఇంకా ఆ షాట్లు తీయకపోవడం విచిత్రమే. అయితే ఎన్టీఆర్ లుక్ పై అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకే వాటిని చాలా బాగా డిజైన్ చేసాడట రాజమౌళి. అందువల్ల చివర్లో తీద్దామని అనుకున్నాడట. అందువల్ల మే ౨౦ న ఎన్టీఆర్ పుట్టినరోజున రామ్ చరణ్ ఇచ్చే గిఫ్ట్ ఉండనట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: