టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా తారలు సరికొత్త ఛాలెంజ్ లతో లాక్ డౌన్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ ఇప్పుడు స్టార్ హీరోల వరకూ వెళ్ళింది. ఉత్త‌మ పురుషులెవ‌రూ ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇలాంటి క్వారంటైన్ టైమ్‌లో ప‌నిచేయించ‌రంటూ ‘బీ ద రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ ను ముందుకు తీసుకెళ్తున్నారు. సందీప్ రెడ్డి వంగా మొదట ఈ ఛాలెంజ్ ను దర్శకుడు రాజమౌళి కి విసరగా.. రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించి తన ఇంటిని శుభ్రం చేసి ఆ ఛాలెంజ్ ను కాస్తా ఎన్టీఆర్ - రామ్ చరణ్‌లకు, కీరవాణి, సుకుమార్, శోభు యార్లగడ్డలకు విసిరిన విషయం తెలిసిందే. దీంతో ఈ సవాలును స్వీకరించిన ఎన్టీఆర్‌ తన ఇంట్లో అంట్లు శుభ్రం చేస్తూ.. ఇల్లు తుడుస్తూ.. ఇంటి ముందున్న చెత్తను ఊడ్చేశాడు. ప్రేమ ఆప్యాయతలే కాదు..ఇంట్లోని పనులను కూడా పంచుకుందాం.. అలా పంచుకుంటే వచ్చే సరదానే వేరు అంటూ పోస్ట్ పెట్టాడు. అంతేకాదు 'బాబాయి బాలకృష్ణ, చిరంజీవి గారు, నాగార్జున బాబాయ్, వెంకటేశ్ గారు, కొరటాల శివ గారికి ఈ సవాలు విసురుతున్నాను’ అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు. ఇప్పటికే కొరటాల, మెగాస్టార్ చిరంజీవి ఛాలెంజ్ స్వీకరించారు కూడా. అయితే మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. అబ్బాయ్ ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌కు బాబాయ్ బాలయ్య స్పందిస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

నిజానికి ఎన్టీఆర్.. బాబాయ్ బాలయ్య గురించి ఎంత ప్రస్తావించినా ఇంతవరకు బాలకృష్ణ.. తారక్ గురించి పెద్దగా స్పందించింది లేదు. అంతేకాకుండా ఎన్నో రోజులుగా బాబాయ్ - అబ్బాయ్ మధ్య సంబంధాలు సరిగా లేవని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. హరికృష్ణ మరణం తర్వాత బాబాయ్ - అబ్బాయ్ కలిసి కనిపించిన సందర్భాలు లేవు. దీంతో వీరి మధ్య దూరం నిజమేనని అందరూ ఒక నిర్ణయానికొచ్చేసారు. కానీ ఎన్టీఆర్ ఈ వార్తలను పట్టించుకోకుండా ‘బాలా బాబాయ్‌’ అంటూ ప్రేమగా పిలుస్తూ ఈ ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌కు నామినేట్ చేశాడు. కానీ బాలయ్య.. ఎన్టీఆర్ ఛాలెంజ్ ని కేర్ చేస్తాడా లేదా అనేది ఇక్కడ చాలా మంది అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. బాలయ్య ఆ సవాలును పట్టించుకోకపోతే వాళ్ళిద్దరికి అసలు పడట్లేదనే అందరు కన్క్లూజన్ కి వచ్చేస్తారు అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట. ఈ ఛాలెంజ్‌ ను బాలయ్య స్వీకరించి ఇలాంటి వార్తలకు చెక్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ సారి బాలయ్య ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్ గురించి ఏమైనా ఆలోచిస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: