దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ వల్ల ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఒక రాష్ట్రంలో చిక్కుకున్నవాళ్లు మరో రాష్ట్రానికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వేరే రాష్ట్రానికి వెళ్లినా  14 రోజులు క్వారంటైన్ కు పరిమితం కావాల్సి ఉండటంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. 
 
కానీ లాక్ డౌన్ వల్ల కొంతమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాజీ ఎంపీ, బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్ కుమార్ ముంబై లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 95 ఏళ్ల బసంత్ కుమార్ గత కొంతకాలం నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే తండ్రి కడసారి చూపుకు నోచుకోలేని పరిస్థితిలో మిథున్ చక్రవర్తి ఉన్నారు. 
 
ప్రస్తుతం ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో చిక్కుకుపోయారు. లాక్ డౌన్ అమలు వల్ల ఆయన కర్ణాటక దాటి రాలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఆయన తండ్రి చనిపోవడంతో ప్రత్యేక అనుమతితో ఆయన ముంబై చేరుకుంటారో లేదో చూడాల్సి ఉంది. తండ్రి మరణ వార్త తెలిసి మిథున్ శోకసంద్రంలో మునిగిపోయారు. ముంబైకు చేరుకోవడానికి ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. 
 
లాక్ డౌన్ వల్ల సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీల, విద్యార్థుల బాధ వర్ణనాతీతం. కొందరు వందల కిలోమీటర్లు నడిచి తమ సొంతూళ్లకు చేరుకుంటున్నారు. మరికొందరు ఆకలితో అలమటిస్తూ ఇతర రాష్ట్రాల్లో బిక్కుబికుమంటూ జీవనం గడుపుతున్నారు. తమకు సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతించాలని ప్రత్యేక పాసుల కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: