ప్రస్తుతం కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో మన దేశం మొత్తం కూడా రాబోయే మే నెల 3వ తేదీవరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. మిగతా దేశాలతో పోలిస్తే భారత దేశం ఒకింత త్వరగా మేల్కొని కరోనా వ్యాధిని మరింతగా ప్రబలకుండా ఈ విధంగా లాక్ డౌన్ చేయడం మంచిదయిందని అంటున్నారు పలువురు ప్రముఖులు. కాగా దీనితో ఎక్కడి ప్రజలు అక్కడే తమ తమ ఇళ్లలోనే ఉండిపోవడంతో పాటు దేశంలోని అన్ని రంగాలు కూడా పూర్తిగా మూతబడ్డాయి. వాస్తవానికి ఇప్పటికే చాలా రంగాల్లో నష్టాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయని, అలానే ఈ లాక్ డౌన్ ప్రభావం సినిమా పరిశ్రమ మీద కూడా విపరీతంగా ఉందని అంటున్నారు సినిమా విశ్లేషకులు. 

 

దీనివలన ఇప్పటికే అత్యంత భారీ సినిమా అయిన ఆర్ఆర్ఆర్ మొదలుకుని చిన్న సినిమా వరకు కూడా అన్ని సినిమాలు పూర్తిగా షూటింగ్స్ నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందని, దీనితో ఎందరో ఆర్టిస్టుల కాల్షీట్స్ వృధా అవడంతో పాటు నిర్మాతలు సినిమాల పెట్టుబడి కోసం ఫైనాన్సియర్ల నుండి తెచ్చిన అప్పులపై వడ్డీలు విపరీతంగా పెరుగుతున్నాయని అంటున్నారు. ఇక మన దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఈ లాక్ డౌన్ మరొక నెల రోజులు పొడిగింపబడే అవకాశం లేకపోలేదనే వార్తలు వెలువడుతుండడంతో అన్ని రంగాల వారు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. 

 

ఒకవేళ ఆపై లాక్ డౌన్ పొడిగించి, అనంతరం నెల మరొక నెల గడిచిన తరువాత కొంతమేర ఆంక్షలు తొలగించినప్పటికీ కూడా సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ వంటివి ఇప్పట్లో తెరిచే పరిస్థితి లేదని, అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే, పూర్తిగా థియేటర్లు తెరుచుకోవడానికి ఈ ఏడాది చివర వరకు టైం పట్టినా ఆశ్చర్యపోవనక్కర్లేదని అంటున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే థియేటర్లు, మల్టిప్లెక్స్ ల యజమానులు భారీగా నష్టాలు చవిచూసే అవకాశం ఉందని, మరి ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని తాము కూడా సాధారణ ప్రజల మాదిరిగా ఎదురు చూస్తున్నట్లు పలువురు సినిమా ప్రముఖులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: