అది బాలసుబ్రహ్మణ్యం తెలుగు తెరను ఏలుతున్న రోజులు. బాలు ఇండస్ట్రీకి వచ్చిన నాటికి ఘంటసాల వంటి ఉద్ధండ గాయక శిఖామణి ఉన్నారు. అలాగే పీబీ శ్రీనివాస్, ఏఎం రాజా, జేసుదాస్, మాధవపెద్ది, పిఠాపురం నాగేశ్వరరావు  వంటి వారు ఎందరో సీనియర్ గాయకులు ఉన్నారు. ఇక 1966లో సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రారంభించిన బాలు చాలా తక్కువ టైంలో నంబర్ టూ రేంజికి చేరుకున్నారు.

 

ఘంటశాల మరణాంతరం బాలు నంబర్ వన్ సింగర్ అయ్యారు. అయితే ఆయనకు మధ్యలో మూడేళ్ళ పాటు మరో గాయకుడు వి రామక్రిష్ణ నుంచి పోటీ కొంతమేర వచ్చినా బాలు బాగానే  సర్దుకున్నారు. చివరికి 1975 నాటికి  టాలీవుడ్  ప్లేబ్యాక్ లో బాలు ఏకైక మగ గొంతుగా మారి తెలుగు సీమలో స్థిరపడ్డారు. ఇక ఆయనే అప్పట్లో ఎన్టీయార్, ఏయన్నార్, క్రిష్ణ, శోభన్ బాబు వంటి వారికి పాడేవారు. మిగిలిన వారికి కూడా బాలు వాయిసే కావాలని డిమాండ్ పెద్ద ఎత్తున  ఉండేది.

 

ఈ నేపధ్యంలో 1985 వరకూ బాలూకు ఎదురులేకుండా పోయింది. ఆ సమయంలో బాలుకు, అప్పటి నంబర్ వన్ సూపర్ స్టార్ క్రిష్ణకు మధ్య ఎందుకో చిన్న గొడవ వచ్చిందని  ప్రచారంలో ఉంది. దాంతో సినీ పరిశ్రమ‌కు క్రిష్ణ, బాలూ ఒకేసారి వచ్చిన దగ్గర నుంచి ఆయన గాత్రం, ఈయన నటనగా పెనవేసుకున్న వెండితెర బంధం ఒక్కసారిగా తెగిపోయింది.

 

ఆ సమయంలో క్రిష్ణ మంచి పీక్ స్టేజ్ లో ఉన్నారు. ఆయన తన తొలి దర్శకత్వంలో తెలుగు,హిందీ భాషల్లో సింహాసనం  మూవీని తీస్తున్నారు. ఆ మూవీలో ఒక కొత్త గొంతుకను పరిచయం చేశారు. ఆయనే రాజ్ సీతారామ్. ఆకాశంలో ఒక తారా నా కోసమొచ్చింది ఈ వేళ అంటూ ఇప్పటికి మూడున్నర దశాబ్దాలు గడచినా ఆ గొంతు వినిపిస్తూనే ఉంటుంది.

 

మొదటి సినిమాతోనే రాజ్ సీతారామ్ అదరగొట్టేశారు. సింహాసనం మొత్తం సాంగ్స్ సూపర్ డూపర్ హిట్. ఆ తరువాత రాజ్ సీతారామ్  క్రిష్ణ మొత్తం సినిమాలకు ప్లేబ్యాక్ సింగర్ గా పర్మనెంట్ గా సెటిల్ అయిపోయారు. మరో వైపు రాజ్ సీతారామ్  శోభన్ బాబు వంటి హీరోలకు కూడా పాడుతూ తన దూకుడుని  విస్తరించేశారు.

 

దాంతో బాలూకి మళ్ళీ గట్టి పోటీ ఏపడింది. ఆ దశలో గేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి చొరవతో బాలుకు, క్రిష్ణకు మధ్య రాజీ కుదిరింది. తిరిగి మూడేళ్ల తరువాత రాజ్ కోటీ మ్యూజిక్ డైరెక్షన్లో రౌడీ నంబర్ వన్ చిత్రం ద్వారా మళ్ళీ క్రిష్ణ , బాలూ బంధం కలిసింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: