భారత దేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' చిత్రాలతో మన తెలుగు చిత్రాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకొనిపోయాడని చెప్పవచ్చు. అప్పటి వరకు భారీ బడ్జెట్ లో సినిమాలు తెరకెక్కించాలంటే ఇండియాలో కేవలం శంకర్ కు మాత్రమే సాధ్యం అయ్యేది. కానీ రాజమౌళి బాహుబలి చిత్రంతో ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్ కు తీసుకువెళ్లారు. రాజమౌళి తీసే సినిమాలు కమర్షియల్ హంగులతో కూడినవే, సందేశాత్మక చిత్రాలు కావు.. కానీ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి కలిగించడంలో రాజమౌళి స్టయిలే వేరు. టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు. ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి హీరో కోరుకుంటాడు. రాజమౌళిపై కూడా కాపీ విమర్శలు ఉన్నాయి. కానీ రాజమౌళి ఎప్పుడూ అలాంటి విమర్శల్ని పట్టించుకోరు. కాగా ఈ మధ్య ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్కార్ అవార్డు విన్నింగ్ సినిమా 'పారాసైట్'పై జక్కన్న స్పందించారు. ఆ సినిమా తనకు చాలా బోరింగ్ గా అనిపించిందని రాజమౌళి షాకింగ్ కామెంట్లు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా మిశ్రమ స్పందన వచ్చింది.

 

2019 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రంగా కొరియన్ మూవీ 'పారాసైట్' ఆసార్క్‌ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే కేటగిరీల్లో నాలుగు ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకుంది. అయితే ఈ మధ్య పారసైట్ చిత్రాన్ని చూసిన రాజమౌళి మాత్రం సగం సినిమా చూసి మధ్యలోనే నిద్రపోయాడంట. అయితే ఇప్పుడు తాజాగా 'మిఠాయి' అనే సినిమాని అందించిన డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దీనిపై స్పందిస్తూ రాజమౌళిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ బహిరంగ లేక విడుదల చేశాడు. పారసైట్ చిత్రాన్ని అవమానించేలా రాజమౌళి కామెంట్స్ చేయడం సిగ్గు చేటు అని అన్నారు. 'పారసైట్ ఒరిజినాలిటీ కలిగిన అద్భుతమైన క్రియేటివ్ వర్క్. ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు ఈ చిత్రాన్ని ప్రశంసించారు. కానీ బాహుబలి గురించి ప్రపంచ ప్రఖ్యాత ఫిలిం మేకర్స్ మాట్లాడినట్లు నేనెక్కడా చూడలేదు. ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటే మీ సై చిత్రంలో ఒక సన్నివేశం మొత్తం కాపీ చేశారు. మరికొన్ని చిత్రాల్లో కూడా సన్నివేశాలు కాపీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి మీరు అద్భుతమైన పారసైట్ చిత్రం గురించి బ్యాడ్ కామెంట్స్ చేయడం తగదు' అంటూ రాజమౌళిపై ప్రశాంత్ కుమార్ బహిరంగ లేఖ ద్వారా విమర్శల వర్షం కురిపించారు. దీనిపై స్పందించిన నెటిజన్లు 'అసలు నువ్వు ఎన్ని సినిమాలు తీసావ్.. నువ్వు తీసిన మిఠాయి కళాఖండం కాదంటూ' ప్రశాంత్ కుమార్ పై కామెంట్స్ చేస్తూ విరుచుకుపడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: