కరోనా నేపథ్యంలో దేశంలోని అన్ని వ్యవస్థలతో పాటు సినీ పరిశ్రమ కూడా స్థంభించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలకు సినీ హీరోలు విరాళాలు ప్రకటిస్తూ అండగా నిలుస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమలో రజినీకాంత్, విజయ్ లు ఇద్దరూ భారీగా విరాళాలు ప్రకటించారు. ఇప్పుడీ నేపథ్యమే ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేగి ఫ్యాన్ వార్ కు కారణమైంది. ఈ గొడవలో ఓ అభిమాని మరణించడం సంచలనమైంది. ఈ గొడవ కరోనా చారీటీ విషయంలో జరగడం చర్చనీయాంశం అయింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో జరిగిందీ ఘటన.

 

 

22 ఏళ్ల వయసున్న దినేష్ బాబు, యువరాజ్ ఇద్దరూ స్నేహితులు. వీరిలో దినేష్ బాబు హీరో రజినీకాంత్ అభిమాని కాగా.. యువరాజ్ హీరో విజయ్ అభిమాని. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తమ తమ హీరోలే ఎక్కువగా విరాళాలు ఇచ్చారని ఇద్దరూ వాదించుకున్నారు. ఇది చర్చగా మొదలై, అనంతరం వాదులాటగా మారి ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో యువరాజ్ ను దినేష్ గట్టిగా తోసేశాడు. దీంతో కిందపడ్డ యువరాజ్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దినేష్ ను అరెస్టు చేశారు.

 

 

ఘర్షణ సమయంలో వీరిద్దరూ మద్యం సేవించి ఉన్నారని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.  ప్రస్తుతం ఈ వార్త తమిళ సినీ పరిశ్రమలో సంచలనమైంది. లాక్ డౌన్ సమయంలో వీరికి మద్యం ఎలా దొరికిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో సినీ అభిమానం వేరుగా ఉంటుంది. హీరోలను ఓన్ చేసుకుని ఆరాధిస్తూంటారు. అభిమానులు తమ హీరోల సినిమాలకు కటౌట్లు కట్టడం, దండలు వేయడమే కాకుండా ఇలా గొడవలు పడడం, తీవ్ర పరిణామాలకు దారి తీయడం బాధాకరం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: