టాలీవుడ్ లో రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్ తర్వాత కామెడీ చిత్రాల హీరోగా అల్లరి నరేష్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో కామెడీ సినిమాలు అంటే అల్లరోడు పేరు ప్రముఖంగా వినిపించేలా చేసుకున్నాడు. వెండితెర‌పై గ‌త కొన్నేళ్లుగా త‌న‌దైన హాస్యంతో ఆక‌ట్టుకుంటూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకున్నారు. తన కెరీర్లో 55 చిత్రాలను పూర్తి చేసిన నరేష్ తన మొదటి సినిమా 'అల్లరి'తో 'అల్లరి నరేష్'గా మారిపోయారు. హీరోగా నటిస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అలాంటి వాటిలో ‘గమ్యం’ ‘శంభో శివ శంభో’ 'మహర్షి' సినిమాల్లో అల్లరి నరేష్ నటన అద్భుతమని చెప్పవచ్చు. సూపర్‌స్టార్ మహేష్‌ బాబు హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘మహర్షి’. ఈ సినిమా విజయం సాధించడంతో పాటు అల్లరి నరేష్ పాత్రకు కూడా మంచి పేరొచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబుతో కలిసి నటించిన అనుభవాలను తాజాగా అల్లరి నరేష్ పంచుకున్నారు. 

 

లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆయన తాజాగా ఓ టీవీ ఛానెల్‌ తో మాట్లాడుతూ 'మహేష్ అద్భుతమైన నటన గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ ఆయనతో కలిసి నటించిన తరవాత ఒక మనిషిగా ఆయన గురించి నాకు చాలా విషయాలు తెలిసాయి. సినిమాలు కుటుంబం గురించి తప్ప ఆయన వేరే విషయం గురించి ఆలోచించరు మాట్లాడరు' అని నరేష్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 'సెట్స్‌లో మహేష్ బాబు నన్ను సార్ అని పిలిచేవారు.. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. నన్నేకాదు లైట్‌ బోయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు.. ప్రతి ఒక్కరినీ ఇంతే మర్యాదగా గౌరవంగా పిలుస్తారు' అని చెప్పుకొచ్చారు నరేష్. ఇదిలా ఉండగా అల్లరి నరేష్ ప్రస్తుతం ‘నాంది’ అనే సినిమాలో  నటిస్తున్నాడు. ఈ సినిమాను ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్ పతాకంపై ‘శతమానం భవతి’ డైరెక్టర్ సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరచయమవుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రధారులు పోషిస్తున్నారు. దీంతో పాటు 'బంగారు బుల్లోడు' అనే సినిమా చేయబోతున్నట్లు సమాచారం.  

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: