ముందుగా 2002 లో వచ్చిన హోలీ సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసిన రష్మి గౌతమ్, ఆ తర్వాత కరెంట్, ఎవరైనా ఎప్పుడైనా, బిందాస్, చలాకి సహా మరికొన్ని సినిమాల్లో అక్కడక్కడ చిన్న పాత్రల్లో నటించడం జరిగింది. అయితే ముందుగా 2007వ సంవత్సరంలో వనిత టీవీలో ప్రసారమైన యువ ప్రోగ్రాంలో స్వాతి అనే పాత్రలో నటించారు రష్మీ. ఆ తర్వాత ఈ టీవీ ఛానల్లో ప్రసారమైన ఐడియా సూపర్ కార్యక్రమంలో మొత్తం 15 మంది కంటెస్టెంట్ లలో టాప్ 5లో నిలిచిన రష్మీ, ఆ ప్రోగ్రాం 25 ఎపిసోడ్ లో ఎలిమినేట్ కాబడ్డారు. ఇక ఆ తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకున్న రష్మి, 2013లో ఈ టీవీ ఛానల్లో ప్రసారమైన జబర్దస్త్ షో ద్వారా మళ్లీ బుల్లితెరపై రంగప్రవేశం చేసి యాంకర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 

 

దాదాపుగా 7 ఏళ్ళపాటు ఆ ప్రోగ్రాం ద్వారా మెల్లగా తన యాంకరింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ గొప్ప పేరు సంపాదించిన రష్మీ, ప్రస్తుతం బుల్లితెరపై వెలుగొందుతున్న టాప్ యాంకర్లలో ఒకరుగా నిలిచారు. ఇక మధ్యలో అక్కడక్కడా సినిమాల్లో ఇంకా నటిస్తూ ఉన్న రష్మి, కొన్నేళ్ళ క్రితం వచ్చిన గుంటూరు టాకీస్ సినిమా లో సువర్ణ అనే పాత్రలో నటించి మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం పలు టెలివిజన్ చానళ్లలో కొన్ని ప్రోగ్రాములుకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రష్మీ, మొదట్లో యాంకర్ గా రాణించే సమయంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొన్నానని, ఇటువంటి పోటీ రంగంలో విజయం సాధించడం అంటే అంత సులువు కాదని, అందుకే ఎప్పటికప్పుడు తనని తాను మానసికంగా సిద్ధం చేసుకుని ముందుకు నడిచే దానినని, అనుకున్నవన్నీ జరుగుతాయి కాకపోతే దేనికైనా సమయం రావాలని అంటుంటారు. 

 

ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనం చేసే ప్రతి పనిలో కష్టం తప్పనిసరిగా ఉండాలని, అదే మెల్లగా మన గెలుపుని నిర్దేశిస్తుందని రష్మీ తరచూ చెప్తారు. కొన్నేళ్లుగా జబర్దస్త్ నటుడు సుధీర్ తో రష్మీ ప్రేమలో ఉన్నారని వస్తున్న ఈ వార్తలను ఆమె పలు మార్లు ఖండించడం జరిగింది. సుధీర్ తనకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడని, తామిద్దరి మధ్య మంచి అనుబంధం ఉన్నమాట నిజమేనని, అయితే ప్రేక్షకులు అనుకుంటున్నట్లు మా ఇద్దరి మధ్య ప్రేమ కానీ మేం పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తల్లో కానీ ఏ మాత్రం నిజం లేదని రష్మీ తేల్చి చెప్పటం జరిగింది. ఆ విధంగా తొలుత సినిమాలు, ఆపై బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రష్మీ తన ఫ్యామిలీ నే తన బలం అని చెప్తుంటారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: