క‌రోనా కోర‌లు చాచిన వేళ ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ ను ప్ర‌క‌టించాయి. లాక్ డౌన్ తో దేశంలో ఎలాంటి ప‌రిస్థితులు నెల‌కొన్నాయో తెలిసిందే. మూత ప‌డిన సినిమా థియేట‌ర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియ‌ని ప‌రిస్థితి. దాదాపు ఆరు నెల‌ల‌ నుంచి ఏడాది పాటు రీ ఓపెన్ కు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌న్న‌ది నిపుణుల మాట‌. ఇప్ప‌టికే ప‌లువురు టాలీవుడ్ నిర్మాత‌లు సైతం ఇలాంటి వ్యాఖ్య‌లే చేసారు. థియేట‌ర్లో రిలీజ్ చేయాలంటే ఆరు నెల‌లు వెయిట్ చేయాల్సిందే. లేదంటే ప్ర‌త్యామ్నాయ మార్గాలు వెతుక్కోకపోతే సినిమా పాత ప‌డిపోతుంద‌ని హెచ్చ‌రించారు. అలాంటి స‌మ‌యంలో నెట్ ప్లిక్స్, ఆమెజాన్, జీ 5 లాంటి ఆన్ లైన్ వేదిక‌ల్లోనే రిలీజ్ చేయాల్సి ఉంటుంద‌న్నారు. స‌రిగ్గా ఇదే పాయింట్ ను ఆసరాగా చేసుకుని కోలీవుడ్ హీరో, నిర్మాత‌లు ఇప్పుడు థియేట‌ర్ యాజ‌మాన్యాల‌కు, డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీల‌కు గ‌ట్టి షాక్ ఇవ్వ‌డానికి రెడీ అయ్యారు.

 

టిక్కెట్ ధ‌ర పెరిగిపోవ‌డం… ప‌న్ను బాదుడు వంటి ఇబ్బందుల‌ను ఇటీవ‌లే థియేట‌ర్ యాజ‌మాన్య సంఘాలు నిర్మాత‌ల దృష్టికి తీసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా నిర్మాత‌లు దిగి రాక‌పోవ‌డంతో స్వ‌చ్ఛందంగా థియేట‌ర్లు మూసివేస్తామ‌ని య‌జ‌మానులు హెచ్చ‌రించారు. స‌రిగ్గా అది జ‌రిగిన 20 రోజుల‌కి దేశంలో అనుకోకుండా లాక్ డౌన్ అమ‌లులోకి వ‌చ్చి థియేట‌ర్ల‌ను ప్ర‌భుత్వ‌మే మూయించేసింది. దీంతో ప్ర‌స్తుతం రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు నేరుగా డిజిట‌ల్ స్ట్రీమింగ్ ద్వారానే రిలీజ్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. సూర్య నిర్మించిన `పోన్ మ‌గ‌ల్ వందాల్` చిత్రం లాక్ డౌన్ కార‌ణంగా విడుద‌ల చేయ‌లేక ఇబ్బంది ప‌డ‌న్న సంగ‌తి తెలిసిందే.

 

దీంతో ఈ చిత్రాన్ని సూర్య అమెజాన్ ప్రైమ్ కి డిజిట‌ల్ రిలీజ్ రైట్స్ ఇచ్చేసాడు. ఇంకా విజ‌య్ న‌టిస్తోన్న‌ మాస్ట‌ర్.. సూర్య హీరోగా న‌టిస్తోన్న సూర‌రై పొట్రు చిత్రాల‌ను సైతం ఇదే విధానంలో రిలీజ్ కు మొగ్గు చూపుతున్నారు నిర్మాత‌లు. ఈ రెండు సినిమాలు క‌లిపి 185 కోట్ల కు విక్ర‌యించేలా ఆన్ లైన్ ఓటీటీ సంస్థ‌ల‌తో బిజినెస్ సాగించేందుకు చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఆన్ లైన్ లో రిలీజ్ చేయ‌డాన్ని థియేట‌ర్ అసోసియేష‌న్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. ఇలా చేయ‌డం వ‌ల్ల థియేట‌ర్లు శాశ్వ‌తంగా మూత‌ప‌డ‌తాయ‌ని…సినిమా మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం ఉంటుంద‌ని వాపోతున్నారు. అయినా దేనినీ లెక్క చేయ‌క త‌న సినిమాల్ని రిలీజ్ చేసేందుకు సూర్య సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే బాట‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ కొత్త దారిని వెతికార‌ని మాస్ట‌ర్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. మ‌రి ఈ గొడ‌వ చివ‌రికి ఎక్క‌డికి దారి తీస్తోందో.

మరింత సమాచారం తెలుసుకోండి: