వెండి తెర అది. బంగారం పంట పండించే తెర అది. ఎన్నో కలలకు ఊపిరి ఊదేది అక్కడే. మరెన్నో కళలలు ప్రాణం పోసుకునేది అక్కడే. ఒకసారి ఆ తెర మీద కనిపిస్తే చాలు కధానాయకుడు అయిపోయినట్లే. లక్కు తొక్కితే ప్రజానాయకుడు కూడా అయిపోవచ్చు.

 


కరోనా మహమ్మారి కొత్త జీవితాన్ని చూపిస్తోంది. పాత రోత అంటోంది. ఎవరైనా అవుట్ డేటెడ్ గా ఉంటామంటే చలో అంటోంది. మారాల్సిందే. లేకపోతే తంటాలు తప్పవని కూడా అంటోంది. గీత రాతా అన్నీ గీసేసి భారీ కోత పెడుతోంది. కరోనా దెబ్బకు తాత అయినా దారికి రావాల్సిందే.

 

లేకపోతే ఇంతే సంగతులు. ఇక సినిమా పెద్దన్నలు ఇంకా భ్రమల్లో ఉంటే మాత్రం కుదిరే రోజులు కావని చెబుతోంది. అసలే స్లంప్ లో ఉన్న సినిమా పరిశ్రమకు కరోనా కోరలు తీసేసింది. పూర్తిగా పెద్ద తెరను కొరికేసి చించేసింది. ఇపుడు అక్కడ ఉన్నది వెండి తెర కాదు, చిరిగి చాటయిన గత్తర మాత్రమే.

 

రోజులు గడుస్తున్న కొద్దీ రీళ్ళకు రీళ్ళు కట్టలుగా పడి ఉంటున్నాయి. కన్నీళ్ళు పెట్టిస్తున్నాయి. మళ్ళీ పెద్ద తెర మీద వీటిని పేర్చి చూసుకునే ముచ్చట ఇప్పట్లో అయితే ఉండ‌దని సీనీ జోతీష్కులు జోస్యం చెబుతున్నారు. కనీసంగా ఏడాది గరిష్టంగా రెండు నుంచి మూడేళ్ళు సినిమా బొమ్మ మామూలు కావడానికి పడుతుందని చెబుతున్నారు. 

 

ఈ లోగా ఓటీటీ ల మీదనే బండి లాగించాలి అన్న మాట. అంటే ఇన్నాళ్ళూ పెద్ద తెర మాది, మేమే పెత్తందార్లు అని ఫోజులు కొట్టిన వారంతా ఇపుడు కాళ్ళు బార్ల జాపాల్సిందేనని అంటున్నారు. ఇంకా కొంతమందికి భ్రమలు ఉన్నాయని అంటున్నారు. దసరాకు సినిమా బొమ్మ లేచి నిలబడుతుందని, అది దసరా పులి వేషాలు వేస్తుందని కూడా నమ్ముతున్నారు. కానీ సీన్ చూస్తూంటే సంక్రాంతి కి అయినా థియేటర్లలో బొమ్మ పడే అవకాశాలు లేవని తలపండిన వాళ్ళు చెబుతున్న మాట.

 

మరి అదే కనుక జరిగితే డబ్బాలు ఇంట్లో ఉంచుకుని తుప్పు పట్టిపోవాల్సిందే. దాంతో  ఓటీటీ ఫ్లాట్ ఫారం బెటర్ అని ముందు జాగ్రత్తపరులైన నిర్మాతలు, దర్శకులు చెబుతున్నారుట. మరి వింటే ఉన్నంతలో తక్కువ నష్టానికి బయటపడిపోవచ్చునని అంటున్నారు. ఏది ఏమైనా దసర వరకూ పెద్ద సినిమాలు చూసే అవకాశం ఉంది కనీ ఆగే ఓపిక స్తోమతా చిన్న బొమ్మలకు లేదు. సో పెద్ద తెర ఇపుడు ఇనుప తెరగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: