తెర మీద అందమైన అమ్మాయి. పదహారు అందాలను పదిలంగా పరచేస్తూంటే హీరోకు ఆ సొగసు సెగ తగులుకుతుంది. అంతే కవిగా మారుతాడు, గాయకుడుగా గళెమెత్తుతాడు. డ్యాన్సులతో రఫ్ఫాడించేస్తాడు. థియేటర్లలో ఈలలు, గోలలతో పూల వాన పడుతూంటే తెర మీద హీరో హీరోయిన్లు రెచ్చిపోతారు.

 

పచ్చి పచ్చి శ్రుంగారాన్ని పండించేస్తారు. ఏ వెరుపు లేకుండా అందాలను హీరోయిన్ ఆరబోస్తూ యూత్ గుండెల‌ను కొల్లగొడుతుంది. ఇవన్నీ ఎందుకంటే సినిమాల్లో డ్యూయట్లకు అంతటి ప్రాముఖ్యత ఉంది. హీరోహీరోయిన్లలో తమను చూసుకుని ఆడియన్స్ మురిసిపోతారు. వేరే లోకంలోకి వెళ్ళిపోతారు. ఇది అన్ని తరాల్లోనూ ఉంది. 

 

వెండితెర వేలుపులంటే అంతటి అభిమానం. కానీ ఇపుడు సీన్ చూస్తూంటే డ్యూయెట్లు అసలు తీయగలరా. తీస్తే ఎలా తీస్తారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కరోనాకు మందు లేదు, ఉన్నదల్లా సామాజిక దూరం పాటించడమే. మరి సినిమాల్లో అది సాధ్యమా. ఒకవేళ  ఆ దూరాన్ని పాటిస్తే హీరో హీరోయిన్ల మీద ప్రేమ పండదు, శ్రుంగారం పొంగి పొర్లదు.

 

మరి ఏం చేస్తారు అన్నది ఇపుడు అతి పెద్ద ప్రశ్న మాత్రమే కాదు తీవ్రమైన  చర్చ కూడా. షూటింగ్ స్పాట్ లో ధర్మల్ స్క్రీనింగ్ పెట్టుకోవాలి. ఏకంగా రాపిడ్ కిట్స్ ని తెప్పించి ఎప్పటికపుడు టెస్టులు చేయాలి. ఎన్ని టెస్టులు చేసినా కూడా ఎక్కడో ఏదో చిన్న లోపం జరిగితే సందు చూసుకుని కరోనా అంటుకుంటుంది.

 

హీరోయిన్ని వాటేసుకోవాలనుకుంటే కరోనా కాటేస్తుంది. నిజంగా ఇది పెద్ద విషమ పరీక్షే. మరో వైపు చూసుకుంటే భీభత్సమైన ఫైట్లు తీయాలి. విలన్, హీరో ఒకరి మీద ఒకరు పడి దొర్లాలి. కొట్టుకోవాలి. ఆ అఫెక్ట్ రావాలి. ఇది కూడా కత్తి మీద సామే. ఎందుకంటే కరోనా మహమ్మారి ఈ ఇద్దరికీ అతి పెద్ద విలన్. దాన్ని తప్పించుకుని పోరాటాల సీన్లు తీయడం అంటే చాలా కష్టం. 

 

ఇక చలి ప్రదేశాలు, వాన పాటలు, వర్షంలో భీకర సంగ్రామాలు తీయడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కుదరదేమో, మొత్తానికి షూటింగులు జరపాలనుకున్నా ఎలా జరపాలి. కరోనా మహమ్మారిని అడుగు అడుగున్నా కట్టడి చేస్తూ సీన్లు ఎలా తీయాలి. ఇదంతా చాలా కష్టమే. ఓ విధంగా కఠోర యాగమే. 

 

ఇంకో వైపు టీవీ సీరియల్స్ వారికి కూడా కష్టమే. ఏకంగా బెడ్ రూం సీన్స్ టీవీ సీరియల్స్ తో తీసేస్తున్నా వారికి కూడా కరోనా దెబ్బకు యమ గండమే. మొత్తానికి కరోనా పెట్టిన చిచ్చు ఇంతా అంతా కాదుగా,  వేడి వేడి మసాలా లేకుండా చేసేసిందిగా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: