కాలం బాగా మారిపోయింది. ఎంతలా అంటే ఎవరు ఎవర్నీ పట్టించుకోనంతగా. ఇంకా చెప్పాలంటే ఎవరికీ ఎవరూ లెక్కలేనంతగా. ఒకరికి ఒకరు దూరంగా, భారంగా సాగుతున్న రోజులివి. ఒక్క రంగమని కాదు, ఒక్క ప్రాంతమని కాదు, విశ్వమంతా ఇదే రకమైన ధిక్కార ధోరణి ప్రబలింది.

 

ఈ సమయంలో అన్ని చోట్లా కట్టు తప్పేస్తున్నారు. కట్టుబాట్లు అంటే కాదని పొమ్మంటున్నారు. ఈ సమయంలో అసలే  అసంఘటితంగా ఉన్న రంగం అది, పైగా అక్కడ ఉన్నన్ని ఇగోలు మరెక్కడా ఉండవు, అక్కడ కీర్తి సముద్రంలా పొంగుతుంది. కనకం వర్షంలా కురుస్తుంది. అందువల్ల‌ ఎవరికి ఎవరూ తీసిపోరు. ఎవరికి ఎవరూ తక్కువ కారు.

 

అదే సినిమా రంగం. భారతీయ చలన చిత్ర రంగం తీసుకుంటే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఒకే రకమైన ధోరణి కనిపిస్తోంది. పాత నీరుని కొత్త నీరు కొట్టేస్తోంది. అది టాలెంట్ తోనే కాదు, ముందు తరం అన్న అహంతో కూడా. అప్పట్లో బాలీవుడ్లో రాజ్ కపూర్ లాంటి పెద్దలు, దిలీప్ కుమార్ లాంటి వారు లీడ్ చేసేవారు. ఇపుడు అమితాబ్ ని రెస్పెక్ట్ చేస్తున్నారు కానీ ఎవరికి వారే యమునా తీరే.

 

ఇక కోలీవుడ్లోనూ శివాజీగణేషన్ తదితరులు ఉన్నప్పటి రోజులు వేరు. ఇపుడు వేరు. ఇప్పటి జనరేషన్ పాతవారి మాటను పక్కన పెడుతోంది.దూకుడుగా పోతోంది. ఇక టాలీవుడ్ కి వస్తే అదే తీరు, పైగా ఏ పరిశ్రమకూ లేని జాడ్యం మన దగ్గర ఉంది. అదే కులం జబ్బు. ఇక్కడ నాలుగు దశాబ్దాల క్రితం వరకూ ఒకే ఒక కులం టాలీవుడ్ ని శాసిస్తే ఇపుడు మరో కులం పెత్తనం చేస్తోంది.

 

ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు దాసరి నారాయణ రావు అందరివాడు అనిపించుకున్నారు. అది ఆయన పెద్దరికం కర్ర పెత్తనం చేసి కాదు, ఆపదలో ఉన్న వారిని ఆదుకుని, అర్ధ రాత్రి అయినా తన వద్దకు వచ్చిన వారిని సమాదరించి. ఇంకా చెప్పాలంటే మాటలు కాకుండా చేతలలో బడుగులు,బలహీన వర్గాల వారిని ఆయన హత్తుకున్నారు. ఇపుడు ఉన్న వారిని తక్కువ చేయడం కాదు కానీ దాసరి సరి సాటి ఎవరూ లేరని చెప్పాలి. 

 

కొందరు టాలీవుడ్లో పెద్దరికం వహిస్తామని బాధ్యతగా  ముందుకు వచ్చిన అంతా కలవకపోవడం చూస్తున్నారు. దాంతో పెద్దరికాలు అన్నవి భుజకీర్తులకే తప్ప ఎవరి మాట ఎవరు వింటారు, ఏం పాటిస్తారు అన్నట్లుగానే ఎక్కడ చూసినా సినీ పరిశ్రమ తీరు ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: