సినిమా దర్శకులు స్టార్లతో సినిమాలు తీయడానికే ఇష్టపడుతుంటారు. స్టార్లతో సినిమా తీస్తే రిస్క్ తక్కువగా ఉంటుంది. అలాగే డబ్బు, పేరు కూడా వస్తాయి. అందుకని స్టార్ హీరోలతో సినిమా తీయడానికి రెడీ అవుతుంటారు. అయితే ఆ అలవాటే కొందరి డైరెక్టర్ల పాలిట శాపంగా మారిందని అంటున్నారు. స్టార్ హీరోలతో సినిమా అంటే కనీసం సంవత్సరం ఆగాల్సి వస్తుంది. అలా సంవత్సరం తర్వాతైనా అవకాశం వస్తుందా అంటే అదీ అనుమానమే.

 

 

హీరోకి కథ నచ్చకో, మరే కారణంగానో స్టార్ హీరోలు అనుకున్న సమయానికి దొరకడం లేదు. దానివల్ల దర్శకులు చాలా రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన దర్శకులు కూడా వెయిట్ చేయడం అంటే కొంచెం బాధాకరమే. అయితే మరి దీనికి పరిష్కారం ఏమిటి.. స్టార్ హీరోలు నలుగురో, ఐదుగురో ఉంటారు. వాళ్ళతోనే సినిమా చేస్తానని పట్టుకు కూర్చుంటే దర్శకుడి కెరీర్ అక్కడే ఆగిపోతుంది.

 

స్టార్ హీరోతో సినిమాలు చేసినవాళ్ళు చిన్న హీరోలతో సినిమా చేయడానికి చాలా సంకోచిస్తుంటారు. తాము అనుకున్న హీరో కోసం ఎన్నిరోజులైనా వెయిట్ చేస్తారు కానీ చిన్న హీరోతో సినిమా చేయడానికి ముందుకు రారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి, డైరెక్టర్ రేంజ్ పడిపోతుందేమో అన్న సందేహం కావచ్చు. రెండు, మళ్లీ స్టార్ హీరో దొరకడేమో అన్న అనుమానం కావొచ్చు. మూడు, డైరెక్టర్ గా తన మార్కెట్ తెలిసిపోతుందేమో అన్న భయం కూడా కావొచ్చు. ఈ కారణాల వల్ల కొంత మంది స్టార్ హీరోలతో పనిచేసిన వాళ్ళు చిన్న సినిమాలు తీయడానికి భయపడుతున్నారు.

 


ఇది ఇలనే కొనసాగితే కొన్ని రోజులకి చిన్న హీరోతో సినిమా అలవాటు కాకుండా పోతుంది. అసలు అవకాశాలే లేని టైమ్ లో చిన్న సినిమా తీయాల్సి వచ్చినపుడు చాలా కొత్తగా ఫీల్ అవుతారు. అదీ గాక అవకాశాలు లేవన్న కారణంతో చిన్న హీరోతో సినిమా తీశాడని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. అప్పుడే చిన్న హీరోతో సినిమా పెద్ద డైరెక్టర్లకి సవాల్ గా మారుతుంది. అందుకే ఎంతమంది స్టార్స్ తో సినిమా చేసినా కూడా, ఒక్క సినిమా అయినా చిన్న బడ్జెట్ లో తీస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: