ప్ర‌పంచ దేశాలను క‌రోనా తీవ్ర సంక్షోభంలో నెట్టేసింది. అగ్ర‌రాజ్యాలు సైతం ఈ మ‌హ‌మ్మారి కోర‌ల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతున్నాయి. మాన‌వ జాతికి స‌వాల్ విసురుతున్న ఈ మహమ్మారి వ‌ల్ల రాబోయే రోజుల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఖాయంగా క‌నిపిస్తోంది. దీంతో దేశ ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డంతో పాటు, కరోనా ప్రభావం వల్ల అతలాకుతలమైన‌ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌ మరియు వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి.ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనటానికి ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. కరోనా వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు నానా అవస్థలు పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది.

 

ఇక కరోనా మహమ్మారి పై పోరాటంలో భాగంగా తమ వంతు సాయం అందించడానికి పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల కష్టాలు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోడానికి మెగాస్టార్ చిరంజీవి సారధ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ ఛారిటీకి ఎవరికి తోచిన సాయం వాళ్లు అందించాలని మెగాస్టార్ పిలుపునివ్వడంతో ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ సంస్థకు సినిమా ఇండస్ట్రీ నుంచి చిన్న పెద్ద అని తేడా లేకుండా పలువురు సినీ ప్రముఖులు ముందుకొచ్చి భారీ విరాళాలు అందించారు. ఇప్పటికే ఈ ఛారిటీ ద్వారా పేద సినీ కార్మికులకు సాయం చేయడం మొదలు పెట్టేసారు.

 

కరోనాపై పోరాటానికి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రముఖ నిర్మాత మరియు వ్యాపారవేత్త పీపుల్ టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్ర నిర్మాణ సంస్థ అధినేత టి.జి. విశ్వప్రసాద్ టి.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ ను కలిసి రూ.25 లక్షల విరాళం అందించారు. కరోనా ప్రభావంపై మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడల్లా తన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్పంచించాలి అని తమ సంస్థల సామాజిక సేవా కార్యక్రమాలలో భాగం ఇది విశ్వ ప్రసాద్ తెలిపారు. అందుకే కరోనా సహాయక చర్యల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల విరాళం ప్రకటించామని తెలియజేసారు. ఈ సందర్భంగా కరోనా నివారణ చర్యలలో భాగంగా లాక్ డౌన్ లో పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కొనియాడారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: